GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 22 August 2026, 3:22 pm Digital Edition : GURU SWAMY

శ్రీసిటీలో అలరించిన సంగీత విభావరి

శ్రీసిటీ, ఆగస్టు 22, గరుడధాత్రి:

శ్రీసిటీ ఆధ్యాత్మిక, సాహిత్య వేదిక శ్రీవాణి ఆధ్వర్యంలో శనివారం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో నిర్వహించిన సంగీత విభావరి కార్యక్రమం శ్రోతలను ఎంతగానో అలరించింది. సూళ్లూరుపేట కె ఎస్ కళానిలయంకు చెందిన కుమారి కంచెర్ల చంద్రలేఖ బృందం అన్నమాచార్యులు, శ్రీరామదాసు తదితర వాగ్గేయకారుల భక్తి కీర్తనలను మధురంగా ఆలపించారు.
గణపతి ప్రార్థనతో ప్రారంభమై, కుమారి మోక్షిత శ్రీమద్భగవద్గీత పఠనం అనంతరం చంద్రలేఖ, వంశీ, మాచర్ల బత్తినయ్య భక్తి గీతాలతో సంగీత విభావరి కార్యక్రమం శ్రవణానందంగా, రసమయ భరితంగా సాగింది. గాయకులకు సంగీత కళాకారులు మాచర్ల బత్తినయ్య (కీబోర్డ్‌), కొండ వీరాస్వామి (తబల) వాయిద్య సహకారం అందించారు.
కార్యక్రమం అనంతరం శ్రీవాణి తరుపున కళాకారులను ఘనంగా సత్కరించారు.శ్రీసిటీ ఉద్యోగులు, పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు, సాంస్కృతిక ప్రియులు ఇందులో ఉత్సాహంగా పాల్గొన్నారు. శ్రీసిటీ పచ్చని పరిసరాలు, ఆలయ ప్రశాంత వాతావరణం మధ్య భక్తి, సాహిత్యం, సంగీతం సమ్మేళనంగా ఈ కార్యక్రమం నిలిచింది. భక్తులకు తీర్థ, అన్నప్రసాదం పంపిణీ చేశారు. అలాగే శనివారం ఉదయం ఆలయంలో సంప్రదాయ గోపూజ నిర్వహించగా, భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. శ్రీసిటీ పిఆర్ ప్రతినిధి పల్లేటి బాలాజీ కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షించారు.