పలమనేరు, జూన్ 15 ( గరుడ ధాత్రి ) :
రాబోయే జూన్ 28న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ డ్రైవ్‌ను విజయవంతం చేయాలని అడిషనల్ డీఎంహెచ్ఓ డా. జి. వెంకటప్రసాద్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి సంబంధించి పలమనేరు గంటవూరు అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ (యూపీహెచ్) లో సోమవారం ముందస్తు సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన డా. జి. వెంకటప్రసాద్ ఏఎన్ఎమ్ లు, ఆశా వర్కర్లు, మరియు హెల్త్ స్టాఫ్‌కు పలు కీలక సూచనలు చేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ… తమ పరిధిలోని 0 నుండి 5 సంవత్సరాల వయస్సు గల పిల్లలందరికీ వంద శాతం పోలియో చుక్కలు వేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. జూన్ 28న నిర్ణయించిన బూత్‌లలో వ్యాక్సినేషన్ పూర్తి చేసిన అనంతరం, తదుపరి రెండు రోజుల పాటు మిగిలిపోయిన పిల్లల కోసం క్షేత్రస్థాయిలో ఇంటింటి సర్వే నిర్వహించి చుక్కలు వేయాలన్నారు. వ్యాక్సిన్ క్యారియర్లు, కోల్డ్ చైన్ స్టోరేజ్ నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వ్యాక్సిన్ నాణ్యత దెబ్బతినకుండా చూసుకోవడం సిబ్బంది బాధ్యత. పట్టణ పరిధిలోని మురికివాడలు (స్లమ్స్), భవన నిర్మాణ ప్రాంతాలు, ఇటుక బట్టీలు (బ్రిక్ కిల్న్స్) వంటి వలస కార్మికులు ఉండే హై రిస్క్ ఏరియాలపై ప్రత్యేక శ్రద్ధ వహించి, అక్కడ ఉన్న పిల్లలందరికీ వ్యాక్సిన్ అందేలా చూడాలన్నారు.ఈ కార్యక్రమంలో గంటవూరు యూపీహెచ్ మెడికల్ ఆఫీసర్ డా. మౌనిక, హెల్త్ సూపర్‌వైజర్ జయశంకర్ తో పాటు పరిధిలోని ఏఎన్ఎమ్ లు, ఆశా వర్కర్లు మరియు ఆరోగ్య శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.