మండల అభివృద్దే ధ్యేయంగా పనిచేద్దాం – ఎమ్మెల్యే ఆది
గరుడధాత్రి :
మండల అభివృద్దే ధ్యేయంగా పని చేద్దామని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పిలుపునిచ్చారు.
శుక్రవారం వరదయ్య పాలెం ఎంపిడిఓ కార్యాలయం లో నిర్వహించిన సాదారణ సర్వ సభ్య సమావేశంలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పాల్గొని ప్రసంగించారు.
మండలంలో అర్హులైన ప్రతి లబ్ధిదారునికీ ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు.
ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనులను గుర్తించి ప్రతిపాదనలు పంపించాలని నిధులు మంజూరు చేసే బాధ్యత తాను తీసుకుంటానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వడ దెబ్బ వంటి సమస్యతో ఆసుపత్రికి వచ్చే వారికి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లు, సిబ్బందికి ఎమ్మెల్యే సూచించారు.
ఇక నియోజకవర్గంలో పూర్తయిన గ్రామ సచివాలయ భవనాలు, ఆరోగ్య కేంద్రాలు, రైతు సేవా కేంద్ర భవనాలను వెంటనే ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఎమ్మెల్యే ఆదేశించారు.
ఎక్కడైనా సమస్య తలెత్తితే వెంటనే తన దృష్టికి తీసుకువస్తే ఉన్నతాధికారులతో మాట్లాడి పరిష్కారం చూపుతామని ఆయన తెలిపారు.
అనంతరం శాఖల వారీగా తమ ప్రగతి నివేదికలను అధికారులు సభలో చదివి వినిపించారు.
-వంతెనలు, రోడ్లు నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలి
వరదయ్య పాలెం మండలం లో నిర్మాణ దశలో ఉన్న వంతెనలు, రోడ్లు నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఇంజనీరింగ్ ఉన్నతాధికారులకు సూచించారు.
రూ.20 లక్షలతో గోవర్ధన పురం వంతెన నిర్మాణం, రూ.3 కోట్లతో పాండూరు రోడ్డు నిర్మాణం, రూ.2.50 కోట్ల తో తడా నుండి శ్రీ కాళహస్తి వరకు రోడ్డు నిర్మాణం పనులు ప్రారంభమైందని, వాటిని త్వరగా పూర్తి చేయాలని డీఈ, ఏఈ లకు ఎమ్మెల్యే సూచించారు.
-చలపతి భౌతిక కాయానికి ఎమ్మెల్యే ఆదిమూలం నివాళి
వరదయ్య పాలెం మండలం పాండూరు ఒడ్డి పాలెం కు చెందిన ఆంధ్ర జ్యోతి రిపోర్టర్ నాగార్జున తండ్రి చలపతి(84) పరమపదించారు.
సమాచారం అందుకున్న ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మధ్యాహ్నం రిపోర్టర్ నాగార్జున స్వగ్రామానికి చేరుకొని ఆయన తండ్రి భౌతిక కాయానికి నివాళి అర్పించారు.
అనంతరం రిపోర్టర్ నాగార్జున, అతని కుటుంబ సభ్యులను పరామర్శించి, తమ ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు కూటమి పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.