GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 21 July 2026, 9:02 pm Posted by : GURU SWAMY

సూళ్లూరుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయాలి

లేకపోతే కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ ధర్నాకు సిద్ధం: తిరుపతి డిసిసి అధ్యక్షుడు బాల గురువం బాబు హెచ్చరిక

కిడ్నీ బాధితులకు చెన్నై, నెల్లూరు ప్రయాణ భారం తొలగించాలి

సూళ్లూరుపేట, జూలై 21 (గరుడ ధాత్రి):

సూళ్లూరుపేట ప్రభుత్వ వైద్యశాలలో తక్షణమే డయాలసిస్ సెంటర్‌ను ప్రారంభించి, స్థానిక కిడ్నీ బాధితులను ఆదుకోవాలని తిరుపతి జిల్లా కాంగ్రెస్ కమిటీ డిసిసి అధ్యక్షుడు బాల గురువం బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సూళ్లూరుపేటలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

దూర ప్రాంత ప్రయాణాలతో పేదల నరకయాతన

సూళ్లూరుపేట నియోజకవర్గ పరిధిలో వందలాది మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉన్నారని, స్థానికంగా డయాలసిస్ సౌకర్యం లేకపోవడంతో వారంతా వారానికి రెండు మూడు సార్లు నెల్లూరు, తిరుపతి, చెన్నై వంటి సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నిరంతరం ప్రయాణాలు చేయడం వల్ల పేద, మధ్యతరగతి రోగులకు తీవ్ర శారీరక శ్రమతో పాటు ఆర్థికంగా కోలుకోలేని భారం పడుతోందన్నారు.

చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు తప్పవు

ప్రజల అత్యవసర ఆరోగ్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం స్పందించి, సూళ్లూరుపేట ఆసుపత్రిలోనే డయాలసిస్ విభాగాన్ని ఏర్పాటు చేస్తే ఎంతో మంది పేద రోగులకు ఊరట లభిస్తుందన్నారు. ప్రభుత్వం ఈ విషయమై తక్షణమే స్పందించకపోతే, బాధితులను సమాయత్తం చేసుకుని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాలు, ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు తుమ్మ దేవదానం, తిరుపతి పార్లమెంట్ జనరల్ సెక్రటరీ రమేష్ రెడ్డి, రాష్ట్ర ఓబీసీ ప్రధాన కార్యదర్శి భాస్కర్ రావు, నియోజకవర్గ ఇన్చార్జ్ వెంకట చలపతి, సూళ్లూరుపేట టౌన్ ప్రెసిడెంట్ సునీల్ రెడ్డి, మహిళా నాయకులు కాట్నా శ్వేత, మీజూరు చాముండేశ్వరితో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.