GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 23 July 2026, 10:48 pm Posted by : GURU SWAMY

ప్రేక్షకులను భయకంపితులను చేసిన కీచక వధ

మారువేషంలో కీచకున్ని చంపిన భీముడు

రామచంద్రాపురం,జూలై 23: రామచంద్రపురం మండలంలోని నిలువురాళ్ల కమ్మపల్లి లో నిర్వహిస్తూ ఉన్న 60వ మహాభారత వార్షికోత్సవంలో గురువారం కీచక వధ (నర్తనశాల) హరికథ ,రాత్రి పౌరాణిక నాటకం ప్రేక్షకులను భయకంపితులను చేసింది. జూదంలో ఓడిపోయిన పాండవులు 12 సంవత్సరాలు అరణ్యవాసంలో గడిపి ఒక్క సంవత్సరం అజ్ఞాతవాసం గడపటానికి ద్రౌపతి తో పాటు మారువేశాలలో ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా విరటుని కొలువులో ప్రవేశించారు. ద్రౌపతి విరాట రాజు భార్య సుధీష్ణ దేవి వద్ద సెరంద్రీ అనే పేరుతో చెలికత్తెగా,ధర్మరాజు కంకు బట్టారకుడుగా,భీముడు వల్లలుడు అనే పేరుతోవంటలు వాడుగా,అర్జునుడు బృహన్నల,నకుల సహదేవులు అశ్వాలు ,ఆవులు కాపర్లుగా చేరారు. సుధేష్ణ దేవి తమ్ముడు కీచకుడు ఒకరోజు సైరేంద్రి వేషంలో ఉన్న ద్రౌపదిని చూశాడు. ఆమె పైన మోజు పడి తన అక్కకు చెప్పి కళ్ళు తెమ్మని సాకుతో తన వద్దకు పంపమన్నాడు. ఈ విషయాన్ని సైరెంద్రి వల్లలుడిగా మారువేషం లో ఉన్న తన భర్త భీమునికి తెలిపింది. వల్లలూడి సూచనతో సైరెంద్రి కీచకున్ని రాత్రిపూట వంటగదికి రప్పించింది. వంటగదిలో వలలుడిగా ఉన్న బీముడు ముష్టిఘాతాలతో చంపటం వంటి సన్నివేశాలను మధ్యాహ్నం హరికథ భాగవతారిణి స్వర్ణలత చక్కటి గాత్రంతో వీనులకు విందుగా ఆలాపించారు. రాత్రి శ్రీ వెంకటేశ్వర కళానాట్యమండలి కిరణ్ బృందం చక్కటి పాత్రలను పోషించి పరకాయ ప్రవేశం చేసినట్లు ప్రేక్షకులను అబ్బురపరిచారు. మూడు పూటలా పులమనాయుడు కండ్రిగ గ్రామానికి చెందిన తానికొండ చెంగల్రాయనాయుడు, అమరావతి కుటుంబ సభ్యులు సతీష్ , కోమల దంపతులు భక్తులకు అన్నప్రసాద వితరణ గావించారు.

ఆలయ ప్రధాన అర్చకులు హరి స్వామి దివంగత అర్చకులు బ్రహ్మశ్రీ వెంకటరత్నం ఆచారి ఆశీస్సులతో అర్చకులు అరవింద ఆచారి తదితరులు అమ్మవారి కి ప్రత్యేక పూజలు నిర్వహించారు.మూడు వేళల ధూప దీప నైవేద్యాలు సమర్పించి, భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.ఆలయ ధర్మకర్తలు రమేష్ బాబు, రవికుమార్ గ్రామ పెద్దలతో కలిసి అన్ని ఏర్పాట్లు చేశారు.గ్రామ యువత ఉత్సవాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా స్వచ్ఛందంగా సేవలు నిర్వహించారు.భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ఆలయం వద్ద అన్న ప్రసాదాల స్వీకరించి దైవ కృపకు పాత్రులు కావాలని కోరారు.