GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 19 July 2026, 4:14 pm Posted by : GURU SWAMY

శ్రీసిటీలోని అకార్డ్ స్కూల్ కు కేంబ్రిడ్జ్ ఇంటర్నేషనల్ గుర్తింపు

– స్కూల్ యాజమాన్యాన్ని అభినందించిన మంత్రి లోకేష్

శ్రీసిటీ, జూలై 19, 2026:

శ్రీసిటీలోని అకార్డ్ స్కూల్‌కు యుకె కు చెందిన ప్రతిష్టాత్మక కేంబ్రిడ్జ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ గుర్తింపు లభించింది. దీనిని అధికారికంగా ధృవీకరిస్తూ IA770 కేంబ్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ నంబర్‌ను కేటాయించారు. దీంతో అకార్డ్ స్కూల్లో ఇకపై కేంబ్రిడ్జ్ ప్రైమరీ (5–11 ఏళ్లు), కేంబ్రిడ్జ్ లోయర్ సెకండరీ (11–14 ఏళ్లు) విద్యా కార్యక్రమాలను అమలుచేయనున్నారు.

ఈ గుర్తింపుతో విద్యార్థులకు ప్రపంచ ప్రమాణాలకు అనుగుణమైన పాఠ్యాంశాలు, అంతర్జాతీయ స్థాయి కేంబ్రిడ్జ్ చెక్‌పాయింట్ అసెస్‌మెంట్లు, ఉన్నత విద్యతో పాటు గ్లోబల్ అవకాశాలకు అవసరమైన నైపుణ్యాలను అందించే అవకాశం కలుగుతుంది. సృజనాత్మకత, విశ్లేషణాత్మక ఆలోచన, పరిశోధనాత్మక దృక్పథాన్ని పెంపొందించే విధంగా ఈ పాఠ్య ప్రణాళిక రూపొందించబడి ఉంటుంది.

ఈ సందర్భంగా అకార్డ్ స్కూల్ ప్రిన్సిపాల్ బృందా త్యాగరాజన్ మాట్లాడుతూ, కేంబ్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ నెట్‌వర్క్‌లో భాగస్వామ్యం కావడం తమకు గర్వకారణమని తెలిపారు. విద్యార్థులను స్థానికంగానే కాకుండా అంతర్జాతీయ స్థాయిలోనూ రాణించేలా తీర్చిదిద్దే విద్యను అందించేందుకు ఈ గుర్తింపు దోహదపడుతుందని చెప్పారు.

శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డా. రవీంద్ర సన్నారెడ్డి దీనిపై స్పందిస్తూ, శ్రీసిటీ సుస్థిర అభివృద్ధి ప్రణాళికలో విద్య ఒక కీలకమైన అంశమని పేర్కొన్నారు. అకార్డ్ స్కూల్‌కు కేంబ్రిడ్జ్ గుర్తింపు రావడం ద్వారా శ్రీసిటీలో ప్రపంచ స్థాయి విద్యా అవకాశాలు మరింత విస్తరిస్తాయని, భవిష్యత్ నాయకులను తీర్చిదిద్దే దిశగా ఇది ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందని అన్నారు.

ప్రశాంత్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అకార్డ్ స్కూల్ ఇప్పటికే సమగ్ర విద్యకు ప్రాధాన్యత ఇస్తుండగా, తాజా గుర్తింపుతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేంబ్రిడ్జ్ విద్యాసంస్థల నెట్‌వర్క్‌లో చేరింది. అలాగే ఉపాధ్యాయులకు కేంబ్రిడ్జ్ శిక్షణా కార్యక్రమాలు అందుబాటులోకి రావడం ద్వారా బోధన నాణ్యత మరింత మెరుగుపడనుంది.

ఈ పరిణామంతో పరిశ్రమల కేంద్రంగా పేరొందిన శ్రీసిటీ, ప్రపంచ స్థాయి విద్యా కేంద్రంగా కూడా తన గుర్తింపును మరింత బలోపేతం చేసుకుంది.

స్కూల్ యాజమాన్యానికి మంత్రి అభినందనలు..

శనివారం శ్రీసిటీ హెలిప్యాడ్ వద్ద రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి నారా లోకేష్ ను కలిసిన అకార్డ్ స్కూల్ ప్రిన్సిపాల్ బృందా త్యాగరాజన్‌, కేంబ్రిడ్జ్ ఇంటర్నేషనల్ గుర్తింపును ఆయన దృష్టికి తెచ్చారు. స్కూల్ యాజమాన్యాన్ని అభినందించిన మంత్రి, ఈ గుర్తింపు ప్రాంత విద్యా అభివృద్ధికి ప్రధాన మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డితో పాటు ఇతర ప్రముఖులు హాజరయ్యారు.