GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 20 July 2026, 9:49 pm Posted by : GURU SWAMY

సరికొత్త ఆలోచనలు, ఆవిష్కరణలకు వేదికగా.. “స్టార్ట్ అప్ కడప”..!!

-జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి

గరుడ ధాత్రి న్యూస్ కడప, జూలై 20 : సరికొత్త ఆలోచనలు, ఆవిష్కరణలకు వేదికగా జిల్లా యువతను పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో రూపుదిద్దుకుంటున్న “స్టార్ట్ అప్ కడప” ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ సెంటర్ త్వరలో ప్రారంభానికి సిద్ధమవుతోందని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి తెలిపారు.

సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి.. సబ్‌ కలెక్టర్ హెచ్.ఎస్. భావనతో కలిసి దాదాపు పూర్తి కావచ్చిన నిర్మాణ పనులను పరిశీలించారు. భవనం బాహ్య నిర్మాణ పనులను వారంలోపు పూర్తి చేసి, వెంటనే అంతర్గత సదుపాయాల ఏర్పాటును వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించారు. నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకుండా పనులు పూర్తి చేయాలని సూచించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… ప్రతి ఇంటి నుంచి ఒక స్టార్ట్‌అప్‌ ఆవిర్భవించాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా “స్టార్ట్ అప్ కడప” రూపుదిద్దుకుంటోందన్నారు. ఇది కేవలం ఒక భవనం కాదని.. యువత ఆలోచనలకు, ఆవిష్కరణలకు, కొత్త వ్యాపారాల ఆరంభానికి బలమైన వేదికగా నిలవబోతోందని చెప్పారు.
ఈ కేంద్రం ద్వారా స్టార్ట్‌అప్ వ్యవస్థాపకులు, ఫ్రీలాన్సర్లు, చిన్న, మధ్యతరహా వ్యాపార సంస్థలకు అవసరమైన మార్గదర్శకత్వం, ఆధునిక సదుపాయాలు, ప్రోత్సాహం లభిస్తాయని తెలిపారు. కడపను పారిశ్రామిక అవకాశాల కేంద్రంగా తీర్చిదిద్దడంలో ఈ కేంద్రం కీలక పాత్ర పోషిస్తుందన్నారు.

నిర్మాణ పనుల పరిశీలనలో కేఎంసీ కమిషనర్ భవానీ ప్రసాద్, హౌసింగ్ ఇంజనీర్లు, ఏడీపీ యంగ్ ప్రొఫెషనల్స్ తదితరులు పాల్గొన్నారు.