GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 23 July 2026, 9:00 pm Digital Edition : GURU SWAMY

మైదుకూరు సమీపంలో దారుణం: మిస్సింగ్ అని వెతికేలోపే శవమై తేలిన యువకుడు

*పాడైన జగనన్న కాలనీలో బండరాళ్లతో మోది దారుణ హత్య.. ఆ ప్రేమ వ్యవహారమే ప్రాణం తీసిందా?

గరుడ దాత్రి న్యూస్ జులై 23:-​మైదుకూరు:
రాత్రి వేళ ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన ఓ యువకుడు తెల్లారేసరికి దారుణంగా హత్యకు గురైన సంఘటన మైదుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం రేపింది. గుర్తుతెలియని దుండగులు అతడి తలపై బండరాళ్లతో మోది అత్యంత కిరాతకంగా హత్య చేశారు.
​ఘటన వివరాల్లోకి వెళితే..
మైదుకూరు నుంచి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న బోన్ చాన్ పల్లె గ్రామానికి చెందిన యన్నం వెంకటేశ్వర్లు (20) బేల్దారి పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. బుధవారం రాత్రి 8 గంటల సమయంలో ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన వెంకటేశ్వర్లు రాత్రి ఎంతసేపటికీ తిరిగి రాలేదు. దీంతో కంగారుపడిన తల్లిదండ్రులు, బంధువులు రాత్రంతా చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించినా ఫలితం లేకుండా పోయింది.
​జగనన్న కాలనీలో రక్తసిక్తమైన మృతదేహం:
గురువారం ఉదయం 8 గంటల ప్రాంతంలో బోన్ చాన్ పల్లె సమీపంలో ఎవరూ నివాసం ఉండని (పాడుబడిన) జగనన్న కాలనీలో ఓ యువకుడి మృతదేహం పడి ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని, హత్యకు గురైనది వెంకటేశ్వర్లుగా గుర్తించి కన్నీరుమున్నీరయ్యారు. దుండగులు అతడి తలపై బండరాళ్లతో బాదడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది.
​ప్రేమ వ్యవహారమే దారితీసిందా? తండ్రి సంచలన విషయాలు!
మృతుడి తండ్రి సుబ్బారావును పోలీసులు విచారించగా పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. తన కుమారుడు వెంకటేశ్వర్లు గత రెండు నెలలుగా ఫోన్‌లో అమ్మాయిలతో విపరీతంగా మాట్లాడేవాడని తెలిపారు. ముఖ్యంగా మైదుకూరు సమీపంలోని నానుబాలపల్లి వద్ద గల వెంకటసుబ్బయ్య కాలనీకి చెందిన ప్రకాష్ అనే వ్యక్తి కుమార్తెతో తరచూ మాట్లాడుతుండేవాడని, ఈ వ్యవహారమే హత్యకు కారణమై ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు.
​సమాచారం అందుకున్న మైదుకూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసుకుని ప్రేమ కోణంతో పాటు అన్ని కోణాల్లో దర్యాప్తు వేగవంతం చేస్తున్నామని సీఐ కె రమణారెడ్డి తెలిపారు