GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 24 July 2026, 5:48 pm Posted by : GURU SWAMY

డెంగ్యూ వ్యాధిపై అవగాహన సదస్సు – లార్వా సర్వే

పలమనేరు, జులై 24 ( గరుడ ధాత్రి ) :
డెంగ్యూ నివారణ మాసోత్సవం మరియు ‘ఫ్రైడే – డ్రై డే’ కార్యక్రమంలో భాగంగా పలమనేరు సబ్ యూనిట్ ఆఫీసర్ జయశంకర్ ఆధ్వర్యంలో స్థానిక గాంధీనగర్‌లో విస్తృతంగా లార్వా సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పరిసరాలను పరిశీలించి, స్థానిక ప్రజలకు డెంగ్యూ వ్యాధి లక్షణాలు మరియు నివారణ మార్గాలపై ప్రత్యేక అవగాహన కల్పించారు. డెంగ్యూ వ్యాధి వ్యాప్తి చెందకుండా ఉండాలంటే ఇంటి లోపల మరియు వెలుపల వారం రోజులకు పైగా ఉన్న పాత నీటి నిల్వలను వెంటనే తొలగించి, ఆ పాత్రలను ఆరబెట్టిన తర్వాతే మళ్లీ నీటిని నింపుకోవాలని సూచించారు. దీనివల్ల దోమల లార్వా నశించి, దోమల సంతతి వృద్ధి చెందకుండా ఉంటుందని తెలిపారు. దోమల కాటు నుంచి రక్షణ పొందేందుకు ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా దోమతెరలు ఉపయోగించాలని, శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే దుస్తులను ధరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది అనిల, ఎర్రపరెడ్డి మరియు ఆశా కార్యకర్త జయంతి తదితరులు పాల్గొన్నారు.