GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 23 July 2026, 10:24 pm Posted by : GURU SWAMY

​బంధువే దొంగలా మారాడు: ప్రొద్దుటూరులో రూ.2 లక్షల విలువైన బంగారు గొలుసు చోరీ సక్సెస్ కేసు చేధించిన వన్ టౌన్ పోలీసులు

​ముద్దాయి దస్తగిరి రెడ్డి అరెస్ట్.. 20 గ్రాముల బంగారు సరుడు స్వాధీనం
​వివరాలు వెల్లడించిన వన్ టౌన్ సీఐ కొండారెడ్డి
​ప్రొద్దుటూరు (గరుడ ధాత్రి న్యూస్ – జులై 23):
సామాన్లు సర్దడానికి వచ్చి, ఇంట్లోనే దొంగతనానికి పాల్పడిన ఓ వ్యక్తిని ప్రొద్దుటూరు వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి సుమారు రూ. 2 లక్షల విలువైన 20.03 గ్రాముల (రెండు తులాల) బంగారు తాళిబొట్టు సరుడును స్వాధీనం చేసుకున్నట్లు వన్ టౌన్ సీఐ కొండారెడ్డి తెలిపారు.
​ఘటన వివరాలు:
​పోలీసుల సమాచారం మేరకు.. రామేశ్వరం రెడ్డిగారి వీధికి చెందిన బద్వేలి గంగమ్మ (60) అనే వృద్ధురాలికి ఎవరూ లేకపోవడంతో ఈనెల 12వ తేదీన అద్దె ఇంట్లోకి మారేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో సామాన్లు షిఫ్ట్ చేసేందుకు ప్రొద్దుటూరు బంగారయ్య కొట్టాలు ప్రాంతానికి చెందిన తన బంధువు బల్ల దస్తగిరి రెడ్డి (40)ని పిలిచారు. సామాన్లు సర్దుతున్న సమయంలో గంగమ్మ కన్నుగప్పి బీరువాలో ఉన్న 2.03 తులాల బంగారు తాళిబొట్టు సరుడును దస్తగిరి రెడ్డి దొంగిలించాడు.
​ఈనెల 16న బీరువా తెరచి చూడగా బంగారు గొలుసు కనిపించకపోవడంతో గంగమ్మ, దస్తగిరి రెడ్డిని విచారించగా తనకు తెలియదని చెప్పాడు. అతడి ప్రవర్తనపై అనుమానం రావడంతో ఈనెల 22న బాధితురాలు ప్రొద్దుటూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
​అమ్మకానికి యత్నిస్తుండగా పట్టుబడిన నిందితుడు:
​బాధితురాలి ఫిర్యాదుతో ఎస్ఐ శ్రీనివాసులు కేసు (Cr.No. 148/2026 U/s 305(a) BNS) నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గురువారం (జులై 23) మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో నిందితుడు దస్తగిరి రెడ్డి దొంగిలించిన బంగారు చైన్‌ను విక్రయించేందుకు ప్రొద్దుటూరు టౌన్ బంగారు అంగళ్ల వీధిలోని కళామందిర్ సర్కిల్ వద్దకు వచ్చాడు.
​రహస్య సమాచారం అందుకున్న ఎస్ఐ శ్రీనివాసులు తన సిబ్బందితో కలసి దాడి చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పంచనామా నిర్వహించి పెద్దమనుషుల సమక్షంలో బంగారు గొలుసును స్వాధీనం చేసుకొని, ముద్దాయిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.