GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 23 July 2026, 9:08 am Digital Edition : GURU SWAMY

పింఛన్ పేరుతో రూ.1,440 వసూలు.. నకిలీ రశీదుతో డిజిటల్ అసిస్టెంట్ మోసం.. సత్యవేడులో కలకలం

సత్యవేడు, జూలై 22 గరుడధాత్రి :
పింఛన్ దరఖాస్తు పేరుతో సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ ఓ బాధితుడి నుంచి రూ.1,440 వసూలు చేసి, నకిలీ రశీదు ఇచ్చిన ఘటన సత్యవేడు సచివాలయం-4 పరిధిలో వెలుగుచూసింది. బాధితుడి ఫిర్యాదుతో అధికారులు విచారణ ప్రారంభించారు.
బాధితుడి వివరాల ప్రకారం.. సత్యవేడు పట్టణంలోని కోమటిగుంటకు చెందిన ఓ వ్యక్తికి ఏడాది క్రితం పక్షవాతం రావడంతో ఇటీవల కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్‌లో పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. రెండు రోజుల క్రితం సచివాలయం-4కు చెందిన డిజిటల్ అసిస్టెంట్ అశోక్ ఫోన్ చేసి, కలెక్టరేట్ నుంచి ఆదేశాలు వచ్చాయని, వెంటనే సచివాలయానికి రావాలని సూచించాడు.
సచివాలయానికి వెళ్లిన బాధితుడికి ఆన్‌లైన్ పింఛన్ దరఖాస్తు కోసం వెల్ఫేర్ ఫండ్ ఫీజు రూ.840, రిజిస్ట్రేషన్ ఫీజు రూ.600 అంటూ మొత్తం రూ.1,440 వసూలు చేసి రశీదు అందజేశాడు. అయితే ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభించకముందే రిజిస్ట్రేషన్ ఎలా జరిగిందనే అనుమానంతో బాధితుడి కుటుంబ సభ్యులు విచారించగా, రశీదు నకిలీ అని తేలింది.
దీంతో బాధితుడు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయగా, ఘటనపై విచారణ చేపట్టినట్లు సమాచారం. ఈ వ్యవహారం సత్యవేడు ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది.