తిరుపతి, గరుడ దాత్రి న్యూసజూలై 23:
బొప్పాయి రైతులను ఇబ్బందులకు గురిచేసే వ్యాపారులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ వ్యాపారులను హెచ్చరించారు.జిల్లా కలెక్టర్ అధ్యక్షతన గురువారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ నందు తిరుపతి జిల్లా కోడూరు ప్రాంతంలో బొప్పాయి పంట ధరల హెచ్చుతగ్గులు, మార్కెట్ పరిస్థితులు, రైతుల ప్రయోజనాల పరిరక్షణపై జాయింట్ కలెక్టర్ ఆర్. గోవింద రావు, ఉద్యానవన, మార్కెటింగ్, రెవెన్యూ శాఖల అధికారులు, వ్యాపారులు, మధ్యవర్తులు, రైతులతో కలసి జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… మార్కెట్లో డిమాండ్–సరఫరా పరిస్థితులకు అనుగుణంగా బొప్పాయి ధరలు ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రైతుల శ్రమకు తగిన ప్రతిఫలం అందించేందుకు ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.ఇటీవలి రోజుల్లో బొప్పాయి కొనుగోలు ధరల్లో ఆకస్మికంగా తగ్గుదల చోటుచేసుకోవడం, కొందరు ప్రధాన వ్యాపారులు జిల్లా యంత్రాంగం పిలిచిన సమావేశాలకు హాజరుకాకపోవడం, రైతుల్లో ఆందోళన నెలకొనడం వంటి అంశాలను జిల్లా యంత్రాంగం తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిపారు. బొప్పాయి రైతుల సమస్యలపై చర్చించేందుకు జాయింట్ కలెక్టర్,తాను సమావేశాలకు హాజరు కావాలని వ్యాపారస్తులకు పిలుపునిచ్చినా వారు సమావేశాలకు హాజరుకాకపోవడం బాధ్యతారాహిత్యమని పేర్కొన్నారు.
పూర్తిగా పరిపక్వమైన (మేచ్యూర్) పండ్లను మాత్రమే కోయాలని, ధరల్లో స్వల్ప హెచ్చుతగ్గులు వచ్చినా ఆందోళన చెందవద్దని జిల్లా కలెక్టర్ రైతులకు సూచించారు. మార్కెట్ పరిస్థితులను నిరంతరం పరిశీలిస్తూ ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.దేశంలోని ఇతర రాష్ట్రాల మార్కెట్ ధరలను జిల్లా యంత్రాంగం నిరంతరం పరిశీలిస్తోందన్నారు. ఢిల్లీ, గుజరాత్, రాజస్థాన్ తదితర మార్కెట్లలో ఉన్న ధరలు, రవాణా వ్యయాలు, స్థానిక పరిస్థితులను విశ్లేషిస్తూ రైతులకు న్యాయం జరిగేలా చర్యలు చేపడతామని తెలిపారు.
ప్రధాన వ్యాపారులు, మధ్యవర్తులను ఉద్దేశించి మార్కెట్ డిమాండ్–సరఫరా పరిస్థితులకు అనుగుణంగా రైతులకు న్యాయమైన ధర చెల్లించాలని స్పష్టం చేశారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పారదర్శకంగా వ్యవహరించాలని, కొనుగోలు ధరల నిర్ణయంలో కుమ్మక్కు ధోరణి ప్రదర్శించరాదని హెచ్చరించారు.
*మార్కెట్‌ను కృత్రిమంగా ప్రభావితం చేసి ధరలు తగ్గించడం, రైతులను ఇబ్బందులకు గురిచేయడం, కావాలనే ధరలు పడిపోయినట్లు పరిస్థితులు సృష్టించడం, రైతులను మోసం చేసే విధంగా వ్యవహరించడం వంటి చర్యలను ప్రభుత్వం ఏమాత్రం సహించదని కలెక్టర్ స్పష్టం చేశారు.బొప్పాయి రైతులను ఇబ్బందులకు గురిచేసే వ్యాపారులపై అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇతర జిల్లాల కలెక్టర్లతో సమన్వయం చేసి అవసరమైన చర్యలు చేపట్టేందుకు కూడా వెనుకాడబోమన్నారు. రైతుల ప్రయోజనాల పరిరక్షణకు జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని, రైతులను దోపిడీ చేయడానికి లేదా మార్కెట్‌ను కృత్రిమంగా ప్రభావితం చేయడానికి ప్రయత్నించే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.గతంలో మామిడి మార్కెట్‌లో రైతులను మోసం చేయడానికి ప్రయత్నించిన వారిపై కఠిన చర్యలు తీసుకున్నామని గుర్తు చేస్తూ, బొప్పాయి కొనుగోలు వ్యవహారంలో కూడా అదే విధమైన చర్యలు కొనసాగిస్తామని తెలిపారు.రైతులకు గిట్టుబాటు ధర లభించేలా ఉద్యానవన, రెవెన్యూ, మార్కెటింగ్, రవాణా, పోలీసు శాఖలు సమన్వయంతో ప్రతిరోజూ క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని వివిధ మార్కెట్ల ధరలను రోజువారీగా సేకరించి జిల్లా యంత్రాంగానికి నివేదించాలని సూచించారు.సమావేశంలో పాల్గొన్న రైతులు బయటి రాష్ట్రాల వ్యాపారులు కుమ్మక్కై కొనుగోలు ధరలను తగ్గిస్తున్నారని, స్థానిక వ్యాపారులపై కూడా ఒత్తిడి తీసుకొస్తున్నారని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన కలెక్టర్ రైతుల సమస్యలను అత్యంత ప్రాధాన్యతతో పరిష్కరిస్తామని, రైతు నష్టపోతే ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ మౌనంగా ఉండదని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో ఉద్యానవన శాఖ అధికారి జయభరత్ రెడ్డి, మార్కెటింగ్ శాఖ అధికారి సురేంద్ర బాబు , కోడూరు తహసీల్దార్, సంబంధిత శాఖల అధికారులు, కోడూరు ప్రాంత రైతులు, మధ్యవర్తులు బాబు, బాలాజీ, సురేష్ తదితరులు పాల్గొన్నారు.