GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 21 July 2026, 7:46 pm Posted by : GURU SWAMY

ప్రేక్షకులకు కంట నీరు తెప్పించిన ద్రౌపతి వస్త్రాపహరణం

కురు పాండవుల మధ్య మరింత అసూయ రగిల్చిన రాజసూయ యాగం

యుగాంతంకి నాంది పలికిన స్త్రీ నవ్వు

రామచంద్రాపురం,జూలై 21: రామచంద్రాపురం మండలంలోని నిలువు రాళ్ల కమ్మపల్లిలో వెలసి ఉన్న శ్రీ ద్రౌపతి సమేత ధర్మరాజుల ఆలయంలో నిర్వహిస్తూవున్న 60వ మహాభారత వార్షికోత్సవాలలో మంగళవారం హరికథ భాగవతారిణి స్వర్ణలత ఆలాపించిన ద్రౌపతి వస్త్రాపహరణ కథా గానం, రాత్రి శ్రీ వెంకటేశ్వర కళానాట్యమండలి వారు ప్రదర్శించిన ద్రౌపతి మానసంరక్షణ పౌరాణిక నాటకం ప్రేక్షకులకు కంటతడి పెట్టించింది. ఖాండవ వనంలో మృత్యువు నుంచి కాపాడబడ్డ మయుడు కృతజ్ఞతగా పాండవులకు “మయ సభ”ను నిర్మించి ఇచ్చాడు. మయ సభ ప్రవేశ సమయంలో శ్రీకృష్ణుడి సలహా మేరకు ధర్మరాజు కౌరవులను ఆహ్వానించడం, దుర్యోధనుడికి మయసభలో విడిది ఏర్పాటు చేయడం, మయసభలోని అంద చందాలతో దుర్యోధనుడు ఉన్నది లేనట్లు,లేనిది ఉన్నట్లు భ్రమించడం, ఒకచోట కాలుజారి నీటిలో పడటం ఆ దృశ్యాన్ని చూసి ఓ చెలికత్తె నవ్వటం, ఆ సమయంలో పైకి చూసిన దుర్యోధనుడికి ద్రౌపతి కనపడటం, తనను చూసి నవ్వినది ద్రౌపతియే నని పగ పెంచుకోవటం,శకుని సహాయంతో దుర్యోధనుడు ధర్మరాజును జూదానికి ఒప్పించటం,జూదంలో ధర్మరాజు సామ్రాజ్యాన్ని సకల సంపదలను తన తమ్ములైన బీమా నకుల సహదేవులను ద్రౌపదిని పణంగా పెట్టి ఓడిపోవడం, ద్రౌపతి పైన పగ తీర్చుకోవడానికి దుర్యోధనుడు తన తమ్ముడైన దుశ్శాసను నీకు పంపి ద్రౌపతిని నిండు సభలోనికి తీసుకుని వచ్చి అందరూ చూస్తుండగా చీరలు పెరికి అవమానపరచడం, వంటి సన్నివేశాలను హరికథలు ఎంతో చక్కగా స్వర్ణలత భాగవతారని చెప్పారు.శ్రీ వెంకటేశ్వర కళానాట్యమండలి వారు హావ భావాలతో ద్రౌపతి మాన సంరక్షణ నాటకాన్ని కండ్లకు కట్టినట్లుగా ప్రదర్శించారు. ధర్మరాజు నిర్వహించిన రాజసూయ యాగం కురుపాండవుల మధ్య మరింత అసూయ పెంచగా, ద్రౌపతి తనను చూసి నవ్వింది అన్న దుర్యోధనుడి వికలత్వ మనసు కురుక్షేత్ర యుద్ధానికి దారితీసి ద్వాపర యుగం అంతానికి నాంది పలకటం వంటి విషయాలను చక్కగా రక్తి కట్టించారు.

కండ్లు మిరిమెట్లు కొలిపేటి అలంకరణ: పంచమ వేద మహాభారతానికి కేంద్ర బిందువు అయిన ద్రౌపతి మాత మూలవిరాట్ తో పాటు శ్రీకృష్ణ సమేత పాండవ విగ్రహాలకు దివంగత అర్చకులు బ్రహ్మర్షి వెంకటరత్నం ఆచారి వారి దివ్య ఆశీస్సులతో ప్రధాన అర్చకులు హరి స్వామి, అర్చకులు అరవింద ఆచారులు, స్వామి వారి శిష్య బృందం కండ్లు మిరిమిట్లు కొలిపే విధంగా అలంకరణ గావించారు. ఆలయ తటాకంగా పేరుగాంచిన ఈశాన్య సరిహద్దులోని భావించి పంబల మేళాలు పోతురాజులు దివిటీలవారు వెంటరాగా అర్చకుల బృందం చన్నీటి స్నానాన్ని ఆచరించి, కుండతో పవిత్ర జలాన్ని తీసుకొని వచ్చి పంచ ద్రవ్యాలతో కలిపి అభిషేకించారు.పట్టు పీతాంబరాలు ధరింపజేసి పసుపు కుంకుమలతో అలంకారింపజేసి, నానావిధ పరిమళ పుష్పాలతో సింగారించి ధూప దీప నైవేద్యాలు సమర్పించి కర్పూర హారతులు వసంగి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు తీర్థప్రసాదాలు అందించారు. తిమ్మరాజు పల్లి గ్రామానికి చెందిన న్యాయవాది మోమిడి లీలా కృష్ణ, శ్రీదేవి కుటుంబ సభ్యులు తమ పెద్దలు దివంగత టీచర్ చెంగయ్య,కమలమ్మ,మేరిగ రామకృష్ణయ్య, దివంగత రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ నాగరాజరావు వారి జ్ఞాపకార్థం మూడు పూటలా భక్తులకు అన్నదానం నిర్వహించారు. నిలువురాళ్ల కమ్మ పల్లి గ్రామానికి చెందిన దివంగత వెంకటరమనాయుడు ఇంద్రమ్మ కుమారుడు విజయభాస్కర్ విమలమ్మ దంపతులు ద్రౌపతి దేవి మాన సంరక్షణ కార్యక్రమానికి ఉభయ దాతలుగా వ్యవహరించారు. ధర్మకర్తలైన స్థల దాత ఎం సంపత్తు పిళ్లై కుటుంబ సభ్యులు రమేష్ బాబు మరియు రవికుమార్ , గ్రామ పెద్దలతో కలిసి భక్తులకు ఎలాంటి లోటు లేకుండా చర్యలు చేపట్టారు. రామచంద్రాపురం పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున మహాభారత మహోత్సవంలో పాల్గొని తమ శక్తి కొలది ఆలయ అభివృద్ధికి విరాళాలు సమర్పించారు.