కూటమి ప్రభుత్వంలోనే విద్యకు అత్యంత ప్రాధాన్యత
విద్యార్థుల అభివృద్ధి కోసం అనేక చర్యలు
మెగా పేరెంట్స్ మరియు టీచర్స్ మీటింగ్ నందు పాల్గొన్న ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి
పలమనేరు, జులై 24 ( గరుడ ధాత్రి ) :
విద్య సమాజ నిర్మాణానికి పునాది అని పలమనేరు శాసన సభ్యులు అమరనాథ రెడ్డి పేర్కొన్నారు. గంగవరం మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన మెగా పేరెంట్స్–టీచర్స్ మీటింగ్ నందు ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ….కూటమి ప్రభుత్వంలోనే విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
ఒక విద్యార్థి భవిష్యత్తును తీర్చిదిద్దడంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఇద్దరూ సమాన భాగస్వాములన్నారు. ఈ ఇద్దరూ కలిసి పనిచేస్తేనే పిల్లలు విద్యలో, క్రమశిక్షణలో, వ్యక్తిత్వ వికాసంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారని అన్నారు. నేటి ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, నాణ్యమైన బోధన, ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, విద్యార్థుల సమగ్ర అభివృద్ధి కోసం అనేక చర్యలు చేపడుతోందని వివరించారు. ఈ అవకాశాలను ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. తల్లిదండ్రులు పిల్లల మార్కుల గురించి మాత్రమే కాకుండా, వారి ప్రవర్తన, మానసిక ఆరోగ్యం, అభిరుచులు, ప్రతిభల గురించి కూడా శ్రద్ధ వహించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతిరోజూ కొంత సమయం పిల్లలతో గడపాలని మొబైల్ ఫోన్లకు పరిమితి విధించి, చదువుపై ఆసక్తిని పెంచే వాతావరణాన్ని ఇంట్లో కల్పించాలని సూచించారు. ఉపాధ్యాయులు అందిస్తున్న విద్య సమాజ నిర్మాణానికి పునాదిలాంటిదని ప్రతి విద్యార్థిని మీ సొంత బిడ్డగా భావించి, వారిలోని ప్రతిభను వెలికితీయాలని కోరారు. మంచి పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత మనందరిపై ఉందని విద్యార్థులు తల్లిదండ్రుల కలలు, ఉపాధ్యాయుల ఆశయాలు నెరవేర్చే బాధ్యత మీపై ఉందని గుర్తించి కష్టపడి చదవీ క్రమశిక్షణతో మంచి అలవాట్లు అలవరచుకొని మీ విజయం మీ కుటుంబానికే కాదు, మీ పాఠశాలకు, మీ గ్రామానికి, మీ నియోజకవర్గానికి కూడా గర్వకారణం కావాలని పేర్కొన్నారు. మనమంతా కలిసి విద్యను మరింత బలోపేతం చేసి, ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాలను సాధించేలా కృషి చేద్దామని ఆయన కోరారు. అనంతరం చదువులో రాణించిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, కూటమి నాయకులు సోమశేఖర్ గౌడ్, ప్రతాప్ రెడ్డి, దిలీప్ కుమార్, విజయ్ కుమార్, ప్రసాద్ నాయుడు, హరి, అమరనాథ రెడ్డి, భాస్కర్ రెడ్డి, రహీం, గిరిధర్ గోపాల్, యుగంధర్, అరుణ్ మరియు పాఠశాల యాజమాన్య కమిటీ,ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.