GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 22 July 2026, 8:09 pm Digital Edition : GURU SWAMY

ఎన్డీఏ అసమర్థ పాలనకు స్వస్తి పలకాలి: ప్రధాని మోదీ, అమిత్ షా, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి

సూళ్లూరుపేటలో కాంగ్రెస్ శ్రేణుల భారీ ర్యాలీ, మానవహారం.. ఆర్టీసీ బస్టాండ్ వద్ద హోరెత్తిన నిరసనలు!

రాహుల్, ప్రియాంక గాంధీల అక్రమ అరెస్టులను ఖండించిన డీసీసీ అధ్యక్షుడు బాలగురువం బాబు

సూళ్లూరుపేట, జూలై 22 (గరుడ థాత్రి):

కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి దేశంలో పేపర్ లీకేజీలు, అవినీతి కుంభకోణాలు తప్ప ఎలాంటి అభివృద్ధి జరగలేదని తిరుపతి జిల్లా కాంగ్రెస్ కమిటీ డిసిసి అధ్యక్షుడు బాలగురువం బాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్డీఏ అసమర్థ పాలనకు బాధ్యత వహిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

రోడ్డెక్కిన కాంగ్రెస్ శ్రేణులు – హోరెత్తిన సూళ్లూరుపేట:

బుధవారం సూళ్లూరుపేటలోని ఆర్‌అండ్‌బీ బంగ్లా నుంచి ప్రారంభమైన కాంగ్రెస్ శ్రేణుల భారీ ర్యాలీ ప్రధాన బజారు మీదుగా ఆర్టీసీ బస్టాండ్ కూడలి వరకు సాగింది. బస్టాండ్ సెంటర్‌లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీ మానవహారంగా ఏర్పడి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు

ఈ సందర్భంగా బాలగురువం బాబు మాట్లాడుతూ.. నీట్ పేపర్ లీకేజీల వల్ల మానసిక వేదనకు గురై దేశవ్యాప్తంగా 20 మందికి పైగా విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత దారుణమన్నారు. న్యాయం కోసం పోరాడుతున్న విద్యార్థులకు మద్దతుగా ధర్నా చేపట్టిన కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రశ్నించే గొంతులను అధికార బలంతో నొక్కేయాలని చూస్తే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని, 2029 ఎన్నికల్లో ఎన్డీఏకు పరాభవం తప్పదని హెచ్చరించారు.ఈ ఆందోళన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు దేవదానం, తిరుపతి పార్లమెంట్ జనరల్ సెక్రటరీ రమేష్ రెడ్డి, రాష్ట్ర ఓబీసీ ప్రధాన కార్యదర్శి భాస్కర్ రావు, సూళ్లూరుపేట నియోజకవర్గ ఇన్చార్జ్ మావుడూరు వెంకటాచలపతి, టౌన్ ప్రెసిడెంట్ సునీల్ రెడ్డి, మహిళా నాయకులు శ్వేత, చాముండేశ్వరితో పాటు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.