GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 25 July 2026, 4:55 pm Digital Edition : GURU SWAMY

ఎల్లంపల్లి తిరుమలనాథస్వామి ఆలయంలో ఘనంగా తొలి ఏకాదశి వేడుకలు

​శోభాయమానంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ తిరుమలనాథస్వామి వారి దివ్య అలంకరణ

​గరుడ ధాత్రి న్యూస్ మైదుకూరు జులై 25:-విశేషపూజల్లో పాల్గొని తరించిన భక్తులు
మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని ఎల్లంపల్లి గ్రామంలో వెలసిన శ్రీ శ్రీదేవి, శ్రీ భూదేవి సమేత శ్రీ శ్రీ శ్రీ తిరుమలనాథస్వామి* వారి ఆలయంలో ఆషాఢమాస తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం విశేష పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు.
​ఉదయం నుంచే స్వామివారికి మూలవిరాట్ అభిషేకాలు, విశేష అర్చనలు, అష్టోత్తర శతనామావళి పూజలు శాస్త్రోక్తంగా సాగాయి. ఈ పవిత్ర శయన ఏకాదశి పర్వదినాన స్వామివారిని, ఉభయ నాంచారులైన శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను వివిధ రకాల గుబాళించే దివ్య సుగంధ పుష్పమాలలతో, పట్టు వస్త్రాలతో, రత్నఖచిత స్వర్ణాభరణాలతో అత్యంత శోభాయమానంగా అలంకరించారు.
​ఆలయ అర్చకులు స్వామివారి శంఖ చక్ర అభయహస్త దివ్య మంగళ రూపాన్ని భక్తులకు కంటికి ఇంపుగా దర్శనమిచ్చేలా అలంకరించగా, స్వామివారి దివ్య రూపాన్ని చూసి భక్తజనం పరవశించిపోయారు. తొలి ఏకాదశి సందర్భంగా మైదుకూరు పరిసర ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని, తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ పరిసరాలు “ఓం నమో నారాయణాయ”, “గోవిందా గోవిందా” నామస్మరణతో మారుమోగాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.