GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 24 July 2026, 7:46 am Digital Edition : GURU SWAMY

రిజిస్ట్రేషన్ల ప్రైవేటీకరణపై మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఆగ్రహం

దస్తావేజు లేఖరులకు వైఎస్సార్‌సీపీ మద్దతు

గరుడ దాత్రి న్యూస్ ​మైదుకూరు, జులై23:-
రాష్ట్రంలో రిజిస్ట్రేషన్లు, స్టాంప్ డ్యూటీ వసూళ్ల వ్యవస్థను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్ర చేస్తోందని మైదుకూరు మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మైదుకూరులో దస్తావేజు లేఖరులు, స్టాంప్ వెండర్ల సంక్షేమ సంఘం చేపట్టిన నిరసన ధర్నాకు ఆయన పూర్తి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖలో ప్రభుత్వం తీసుకువస్తున్న మార్పులు, జీవో నెంబర్ 396 వల్ల కలిగే నష్టాలపై ఆయన విస్తృతంగా ప్రసంగించారు.

​సబ్-రిజిస్ట్రార్ వ్యవస్థను నిర్వీర్యం చేసే కుట్ర:
ఏళ్ల తరబడి ప్రభుత్వ పర్యవేక్షణలో అత్యంత పారదర్శకంగా జరుగుతున్న రిజిస్ట్రేషన్ల ప్రక్రియను, కార్పొరేట్ కంపెనీలకు ధారాదత్తం చేసేందుకు ప్రభుత్వం తహతహలాడుతోందని విమర్శించారు.
​ప్రజా ఆస్తుల డేటా భద్రత ప్రశ్నార్థకం:
రాష్ట్ర ప్రజలకు చెందిన ఇళ్లు, స్థలాలు, వ్యవసాయ భూములకు సంబంధించిన అత్యంత సున్నితమైన ఆస్తుల సమాచారాన్ని ప్రైవేట్ వ్యక్తుల వద్ద ఉంచడం అంటే, వారి భద్రతను అక్రమార్కుల చేతుల్లో పెట్టడమేనని హెచ్చరించారు.
​ప్రభుత్వ రాబడికి గండి – కార్పొరేట్లకు లబ్ధి:
ప్రభుత్వ ఖజానాకు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న స్టాంప్ డ్యూటీ వసూళ్లను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం ద్వారా ప్రభుత్వ రాబడికి తీవ్ర గండిపడే ప్రమాదం ఉందన్నారు. ప్రజల సొమ్మును ప్రైవేట్ వ్యాపారుల చేతుల్లో పెట్టడమే దీని ముఖ్య ఉద్దేశమని ఆరోపించారు.
​లక్షలాది కుటుంబాల జీవనోపాధిపై దెబ్బ:
స్టాంప్ వెండర్లు, దస్తావేజు లేఖర్లు తరతరాలుగా ఈ వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్నారని, జీవో 396 వల్ల రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వేలాదిమంది లేఖర్లు, వారిపై ఆధారపడిన కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు.
​జీవో 396 రద్దు వరకు విశ్రమించం:
ఉద్యోగుల, కార్మికుల పొట్ట కొట్టే జీవో నెంబర్ 396 ను ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితుల తరఫున వైఎస్‌ఆర్‌సీపీ రాజీలేని పోరాటం చేస్తుందని, జీవో రద్దు అయ్యే వరకు నిరసనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.
​ ప్రజా ఆస్తుల భద్రతను పణంగా పెడుతూ, దస్తావేజు లేఖర్ల పొట్టకొట్టేలా చంద్రబాబు ప్రభుత్వం జారీ చేసిన జీవో 396 ను వెంటనే ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో వైఎస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయిలో ఆందోళనలను తీవ్రతరం చేస్తామని శెట్టిపల్లి రఘురామిరెడ్డి హెచ్చరించారు ఈ కార్యక్రమం లో వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శి రెడ్డెం వెంకట సుబ్బారెడ్డి వైఎస్ఆర్సిపి పట్టణ అధ్యక్షులు కేపీ లింగన్న మాజీ మున్సిపల్ కౌన్సిలర్ మహబూబ్ షరీఫ్ రిజిస్టర్ ఆఫీస్ పరిధిలోని స్టాంపు వెండర్లు వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొన్నారు