GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 19 July 2026, 5:29 pm Posted by : GURU SWAMY

గంగమ్మ ఆలయ ఛైర్మన్ డా. ఆర్. మురుగన్‌కు అరుదైన గౌరవం

ఒకే వేదికపై రెండు అంతర్జాతీయ గౌరవ డాక్టరేట్ల ప్రదానం!

పలమనేరు, జులై 19 (గరుడ ధాత్రి ) :
ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, సామాజిక సేవా తత్పరుడు, గంటావూరు గంగమ్మ గుడి ఛైర్మన్ డాక్టర్ ఆర్. మురుగన్ ని అరుదైన అంతర్జాతీయ గౌరవం వరించింది. సమాజ శ్రేయస్సుకు ఆయన చేసిన నిరంతర కృషిని గుర్తిస్తూ, ప్రముఖ అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు ఒకే వేదికపై రెండు గౌరవ డాక్టరేట్ డిగ్రీలను ప్రదానం చేసి ఘనంగా సత్కరించాయి. అమెరికన్ విస్డోమ్ పీస్ యూనివర్సిటీ మరియు ఏషియన్ ఇంటర్నేషనల్ కల్చర్ రీసెర్చ్ యూనివర్సిటీ సంయుక్తంగా నిర్వహించిన ఒక ప్రత్యేక ప్రదానోత్సవ కార్యక్రమంలో డా. ఆర్. మురుగన్ కి ఈ ప్రతిష్టాత్మక డాక్టరేట్ ను అందజేశారు. ఎలాంటి స్వార్థం లేకుండా, సమాజ శ్రేయస్సు కోసం, వెనుకబడిన వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం డా. ఆర్. మురుగన్ అందిస్తున్న నిరంతర సేవలను గుర్తిస్తూ ఒక గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేశారు. గంటావూరు గంగమ్మ దేవాలయ ఛైర్మన్‌గా ఆధ్యాత్మిక రంగానికి ఆయన చేకూరుస్తున్న సేవలను, సనాతన ధర్మ ప్రచారానికి మరియు సాంస్కృతిక కార్యక్రమాల విజయవంతానికి ఆయన చేసిన విశిష్ట కృషిని కొనియాడుతూ రెండవ గౌరవ డాక్టరేట్‌ను బహుకరించారు. ఒకే వేదికపై, ఒకేసారి రెండు అంతర్జాతీయ యూనివర్సిటీల నుండి గౌరవ డాక్టరేట్లను అందుకోవడం పట్ల డా. ఆర్. మురుగన్ అభిమానులు, గంటావూరు గంగమ్మ ఆలయ భక్తులు మరియు స్థానిక ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ పురస్కారం ఆయన సమాజానికి చేస్తున్న సేవలకు దక్కిన నిజమైన గుర్తింపు అని కొనియాడారు. ఈ సందర్భంగా డా. ఆర్. మురుగన్ మాట్లాడుతూ… “ఈ గౌరవం నా బాధ్యతను మరింత పెంచింది. గంటావూరు గంగమ్మ తల్లి ఆశీస్సులతో, ప్రజల ఆదరాభిమానాలతో భవిష్యత్తులో మరిన్ని ఆధ్యాత్మిక, సామాజిక సేవా కార్యక్రమాలను విస్తృతంగా చేపడతాను. నన్ను ఈ పురస్కారాలకు ఎంపిక చేసిన అమెరికన్ విస్డోమ్ పీస్ యూనివర్సిటీ మరియు ఏషియన్ ఇంటర్నేషనల్ కల్చర్ రీసెర్చ్ యూనివర్సిటీల ప్రతినిధులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, యూనివర్సిటీ ప్రతినిధులు మరియు ఆధ్యాత్మిక వేత్తలు పాల్గొని డా. ఆర్. మురుగన్ గారిని శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు.