GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 24 July 2026, 1:55 pm Digital Edition : GURU SWAMY

వ్యవసాయ మోటారు స్టాటర్ల దొంగతనాలతో రైతులకు భారీ నష్టం

-పోలీసుల నిర్లక్ష్యంపై రైతుల ఆగ్రహం

-నైట్ బీట్‌లు పెంచాలని డిమాండ్

నాగలాపురం జూలై 24 గరుడధాత్రి :

నాగలాపురం మండలంలోని వెంబాకం గ్రామంతో పాటు పరిసర గ్రామాల్లో వ్యవసాయ మోటారు స్టాటర్ల దొంగతనాలు వరుసగా జరుగుతుండటంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఒక్కో మోటారు స్టాటర్ విలువ రూ.12 వేలకు పైగా ఉండగా, తరచూ దొంగతనాలకు గురవుతుండటంతో రైతులకు భారీ ఆర్థిక నష్టం వాటిల్లుతోంది. రైతులు పలుమార్లు పోలీసులకు ఫిర్యాదులు చేసినప్పటికీ తగిన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.
ముఖ్యంగా వెంబాకం గ్రామంలోనే ఇలాంటి ఘటనలు పదేపదే చోటుచేసుకుంటున్నాయని, పోలీసుల నైట్ బీట్‌లు సక్రమంగా లేకపోవడం వల్లే దొంగలు రెచ్చిపోతున్నారని రైతులు వాపోతున్నారు.
ఈ ప్రాంతంలో ఇప్పటివరకు వందకు పైగా వ్యవసాయ మోటారు స్టాటర్లు దొంగిలించబడినట్లు సమాచారం. దీంతో రైతులకు దాదాపు రూ.10 లక్షలకు పైగా నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.
ఈ ఘటనలపై ప్రభుత్వం స్పందించి నష్టపోయిన రైతులను ఆదుకోవడంతో పాటు, పోలీసు యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించి నిందితులను త్వరితగతిన అరెస్టు చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే వ్యవసాయ ప్రాంతాల్లో రాత్రి వేళల్లో పోలీసు గస్తీని మరింత కట్టుదిట్టం చేసి ఇటువంటి దొంగతనాలను అరికట్టాలని కోరుతున్నారు.