GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 23 July 2026, 3:32 pm Digital Edition : GURU SWAMY

తడలో చారిత్రాత్మక కోనేరు కాలుష్యానికి గురి.. దుర్వాసనతో ప్రజల తీవ్ర ఇబ్బందులు

తడ జూలై 22 గరుడధాత్రి : తడ పట్టణంలోని మసీదు సమీపంలో ఉన్న చారిత్రాత్మక కోనేరు తీవ్ర కాలుష్యానికి గురై దుర్వాసన వెదజల్లుతోంది. కోనేరులో చేపలు, చికెన్ వ్యర్థాలు, ఇతర చెత్తను నిర్లక్ష్యంగా పడవేయడంతో పాటు, పరిసర ప్రాంతాల ఇళ్ల నుంచి డ్రైనేజీ నీటిని నేరుగా కోనేరులోకి వదిలేస్తుండటంతో నీరు పూర్తిగా కలుషితమైంది.
దీంతో కోనేరు పరిసరాల్లో నివసిస్తున్న ప్రజలు భరించలేని దుర్వాసనతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దోమలు, ఈగలు అధికంగా పెరగడంతో డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు.
స్థానికులు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ సంబంధిత అధికారులు ఇప్పటివరకు సమర్థవంతమైన చర్యలు తీసుకోలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. చారిత్రాత్మక ప్రాధాన్యం కలిగిన ఈ కోనేరును పరిరక్షించడం ప్రభుత్వ బాధ్యత అని, వెంటనే కోనేరును శుభ్రపరిచి డ్రైనేజీ నీరు చేరకుండా శాశ్వత చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఈ సందర్భంగా హైకోర్టు అడ్వకేట్ వాకాటి మల్లికార్జున మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మున్సిపల్, పంచాయతీ మరియు సంబంధిత శాఖల అధికారులు తక్షణమే స్పందించాలని కోరారు. కోనేరులో పేరుకుపోయిన వ్యర్థాలను పూర్తిగా తొలగించి, శాశ్వత పారిశుద్ధ్య చర్యలు చేపట్టడంతో పాటు డ్రైనేజీ నీరు కోనేరులోకి చేరకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు.
అలాగే కోనేరు చుట్టూ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి, చెత్త, చేపలు మరియు మాంస వ్యర్థాలు పడేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ చారిత్రాత్మక కోనేరును పరిరక్షించి ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణాన్ని అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.