GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 22 July 2026, 7:20 pm Posted by : GURU SWAMY

కోమన్నూతల అరటికి ప్రపంచ మార్కెట్లో మరింత గుర్తింపు తీసుకురావాలి..!

గరుడ దాత్రి న్యూస్ కడప, జూలై 22:
కోమన్నూతల అరటి సాగు నాణ్యత, ఉత్పత్తి, మార్కెటింగ్ పరంగా దేశానికే కాకుండా ప్రపంచ స్థాయిలో ఆదర్శంగా నిలిచేలా రైతులు, అధికారులు సమిష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు.

పులివెందుల నియోజకవర్గ పర్యటనలో భాగంగా బుధవారం జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి లింగాల మండలం కోమన్నూతల గ్రామాన్ని సందర్శించి, అక్కడ విస్తారంగా సాగవుతున్న అరటి తోటలను పరిశీలించారు. రైతులతో నేరుగా మాట్లాడి పంట సాగు, దిగుబడులు, మార్కెటింగ్, ఎగుమతి అవకాశాలు, ఎదురవుతున్న సవాళ్లపై సమగ్రంగా చర్చించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. దేశంలోనే విశిష్ట గుర్తింపు పొందిన కోమన్నూతల అరటి పంట జిల్లాకు గర్వకారణమని అన్నారు. ఉద్యాన పంటల అభివృద్ధిలో ఈ గ్రామం ప్రత్యేక స్థానాన్ని సంపాదించిందని, జిల్లాతో పాటు రాష్ట్ర స్థూల విలువ ఆధారిత ఉత్పత్తి (జీవీఏ)లో అరటి సాగు కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు.

లింగాల మండలంలోని కోమన్నూతల గ్రామంలో సుమారు 1,800 మంది రైతులు 3,600 ఎకరాల్లో అరటి సాగు చేస్తున్నారని తెలిపారు. ఇక్కడ పండే అరటికి దేశీయ మార్కెట్‌తో పాటు విదేశీ మార్కెట్లలో కూడా మంచి ఆదరణ ఉందని, ఆ అవకాశాలను మరింత విస్తరించే దిశగా అధికారులు కార్యాచరణ రూపొందించాలని సూచించారు.

అరటి పంటకు విలువ ఆధారిత ఉత్పత్తులు, శీతల గిడ్డంగులు, నాణ్యమైన ప్యాకేజింగ్, రవాణా, మార్కెటింగ్ సదుపాయాలు మరింత మెరుగుపడితే రైతులకు అధిక ఆదాయం లభిస్తుందని చెప్పారు. రైతులకు మార్కెట్ ధోరణులు, నాణ్యత ప్రమాణాలు, ఎగుమతి విధానాలపై నిరంతరం అవగాహన కల్పించాలని ఉద్యానశాఖ అధికారులను ఆదేశించారు.
పంట సాగులో శాస్త్రీయ యాజమాన్యాన్ని పాటించడం అత్యంత అవసరమని కలెక్టర్ పేర్కొన్నారు. నేల పరీక్షల ఆధారంగా ఎరువుల వినియోగం, సమతుల్య పోషక నిర్వహణ, అవసరానికి అనుగుణంగా పురుగుమందుల వినియోగం, పంట సంరక్షణ చర్యలు చేపట్టాలని రైతులకు సూచించారు. సూక్ష్మ నీటి పారుదల పద్ధతులను విస్తృతంగా అమలు చేయడం ద్వారా నీటి వినియోగం తగ్గి దిగుబడులు పెరుగుతాయని వివరించారు.

వ్యవసాయ యాంత్రీకరణ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, నూతన సాగు విధానాలను రైతులు అలవర్చుకోవాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం ద్వారా ఉత్పత్తి వ్యయం తగ్గి, నాణ్యమైన దిగుబడులు సాధించవచ్చని తెలిపారు.

రైతులు వ్యక్తిగతంగా పంటను విక్రయించే విధానానికి బదులుగా సంఘటితంగా పనిచేస్తే మార్కెట్లో మరింత బలమైన స్థానం సాధించగలరని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. రైతులందరూ తప్పనిసరిగా “రైతు ఉత్పత్తిదారుల సంస్థలు” (ఎఫ్‌పీఓలు)లో సభ్యులుగా చేరి సమిష్టిగా వ్యవహరించాలని సూచించారు. ఎఫ్‌పీఓల ద్వారా రైతులు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు తక్కువ ధరలకు సమకూర్చుకోవడంతో పాటు, పంటను ఒకే వేదికపై పెద్ద మొత్తంలో విక్రయించే అవకాశం లభిస్తుందని తెలిపారు. దీంతో మధ్యవర్తులపై ఆధారపడాల్సిన అవసరం తగ్గి, రైతులకు గిట్టుబాటు ధరలు లభించే అవకాశాలు మెరుగుపడతాయని చెప్పారు.

ప్రస్తుతం దేశంలోనే అత్యంత విజయవంతంగా కొనసాగుతున్న మహారాష్ట్ర రాష్ట్రంలోని నాసిక్‌కు చెందిన “సహ్యాద్రి ఫార్మ్స్ ఎఫ్‌పీఓ” రైతుల సంఘటిత శక్తికి గొప్ప నిదర్శనమని కలెక్టర్ పేర్కొన్నారు. వేలాది మంది రైతులను ఒకే వేదికపైకి తీసుకువచ్చిన సహ్యాద్రి ఎఫ్‌పీఓ, నాణ్యమైన ఉత్పత్తులను దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేస్తూ రైతుల ఆదాయాన్ని గణనీయంగా పెంచిందని తెలిపారు.
కోమన్నూతల అరటి రైతులు కూడా అదే తరహాలో సంఘటితంగా ముందుకు వచ్చి బలమైన ఎఫ్‌పీఓలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

ఎఫ్‌పీఓల ద్వారా పంట మార్కెటింగ్, శాస్త్రీయ గ్రేడింగ్, నాణ్యమైన ప్యాకేజింగ్, శీతల నిల్వ సదుపాయాల వినియోగం, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ, దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లతో ప్రత్యక్ష అనుసంధానం వంటి అంశాల్లో పురోగతి సాధించవచ్చని వివరించారు. ఈ విధంగా రైతులు ఉత్పత్తిదారులుగానే కాకుండా వ్యాపారవేత్తలుగా ఎదిగి, కోమన్నూతల అరటికి ప్రపంచ మార్కెట్లో మరింత ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యానశాఖ అధికారి హరిప్రసాద్, ఉద్యానశాఖ సహాయ సంచాలకుడు రవిచంద్ర, ఎపిఎంఐపీ, సంబంధిత వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు, రైతులు పాల్గొన్నారు….