GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 19 July 2026, 4:47 pm Posted by : GURU SWAMY

ఆన్‌లైన్ వ్యభిచారం పేరుతో వల.. లొకేషన్‌కు వెళ్తే షాకింగ్ ట్విస్ట్, బెంగళూరులో భారీ దందా !

వ్యభిచారం ప్రకటనలతో బురిడీ కొట్టించి దోపిడీలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్

బెంగళూరు సీసీబీ పోలీసుల చేతికి చిక్కిన 11 మంది నిందితులు

యాప్‌లో ప్రకటన చూసి వెళ్లిన వైట్‌ఫీల్డ్ నివాసి ఫిర్యాదుతో వెలుగులోకి

ఇతర రాష్ట్రాల మహిళలను తెచ్చి, ఆన్‌లైన్ ద్వారా కస్టమర్లకు వల

ఆన్‌లైన్ క్లాసిఫైడ్స్ యాప్‌లో వ్యభిచారం ప్రకటనలతో కస్టమర్లను ఆకర్షించి, ఆపై వారిని నిర్దేశిత ప్రాంతానికి పిలిపించి దోపిడీలకు పాల్పడుతున్న ఒక అంతర్రాష్ట్ర ముఠా గుట్టును బెంగళూరు పోలీసులు రట్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి శనివారం మొత్తం 11 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
బెంగళూరులోని వైట్‌ఫీల్డ్‌కు చెందిన ఒక వ్యక్తి జులై 16న సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సిసిబి) మహిళా సంరక్షణ విభాగాన్ని ఆశ్రయించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. బాధితుడు ఒక యాప్‌లో వచ్చిన ప్రకటనకు స్పందించగా, నిందితులు అతనికి ఒక లైవ్ లొకేషన్ పంపి హెచ్‌బిఆర్ లేఅవుట్‌కు రమ్మన్నారు. బాధితుడు అక్కడికి చేరుకోగానే.. నిందితులు ఒక ఆటోరిక్షాలో కూర్చున్న ఇద్దరు మహిళలను చూపించి, వారితో గడపడానికి రేటు మాట్లాడటం ప్రారంభించారు. ఆ మాటల్లో పడేసి, ఒక్కసారిగా బాధితుడిపై దాడి చేసి అతని వద్ద ఉన్న నగదు, మొబైల్ ఫోన్‌ను లాక్కుని పరారయ్యారు.
బాధితుడి ఫిర్యాదుపై కేజీ హళ్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. సీసీబీ మహిళా రక్షణ విభాగం అధికారులు రంగంలోకి దిగి వివిధ కోణాల్లో దర్యాప్తు జరిపారు. జులై 17న హెచ్‌బిఆర్ లేఅవుట్‌లోని పలు ప్రాంతాలపై దాడులు చేసి 11 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి నేరానికి ఉపయోగించిన రెండు ఆటోరిక్షాలు, నాలుగు ద్విచక్ర వాహనాలు, 13 మొబైల్ ఫోన్లు, నగదును స్వాధీనం చేసుకున్నారు.
ఇతర రాష్ట్రాల నుంచి మహిళలను బెంగళూరుకు తీసుకువచ్చి, వారికి వివిధ చోట్ల వసతి కల్పించి, వారి ఫోటోలను యాప్‌లలో అప్‌లోడ్ చేసి ఈ దందా నడుపుతున్నట్లు నిందితులు ఒప్పుకున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా లేదా ఆన్‌లైన్ వెబ్‌సైట్లలో వచ్చే ఇలాంటి అక్రమ, వ్యభిచార ప్రకటనలకు ఎవరూ స్పందించవద్దని బెంగళూరు సిటీ పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇలాంటి మోసాలు కనిపిస్తే వెంటనే హెల్ప్‌లైన్ నంబర్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు