GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 20 July 2026, 8:34 pm Posted by : GURU SWAMY

గ్రీవెన్స్‌కు అధికారుల జంప్: సూళ్లూరుపేటలో నీరుగారుతున్న ‘ప్రజా వేదిక

*11:45 దాటినా కార్యాలయానికి రాని సిబ్బంది, అధికారులు.. గంటల తరబడి బాధితుల నిరీక్షణ*

*ప్రభుత్వ ఆదేశాలకే తూట్లు పొడుస్తున్న నిర్లక్ష్యం.. ఉన్నతాధికారులు స్పందించాలని డిమాండ్*

*సూళ్లూరుపేట, (కాకతీయ ప్రతినిధి) జూలై 20*

ప్రజల సమస్యలను నేరుగా స్వీకరించి, వాటికి అక్కడికక్కడే సత్వర పరిష్కారం చూపాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సోమవారం అత్యంత ప్రాధాన్యతతో నిర్వహిస్తున్న ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని సూళ్లూరుపేట మండల స్థాయి అధికారులు తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తున్నారు. అధికారుల అలసత్వం మరియు బాధ్యతారాహిత్యంతో సోమవారం నాటి కార్యక్రమం పూర్తిగా ప్రశ్నార్థకంగా మారింది.

*గంటల తరబడి బాధితుల నరకయాతన:*

సుదూర ప్రాంతాల నుండి ఎన్నో ఆశలతో వినతిపత్రాలు చేతపట్టుకుని ఉదయమే సూళ్లూరుపేట కార్యాలయానికి చేరుకున్న బాధితులకు తీవ్ర నిరాశే ఎదురైంది. నిర్ణీత సమయం దాటి, ఉదయం 11:45 గంటలు కావస్తున్నా సంబంధిత అధికారులు విధులకు హాజరు కాకపోవడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భూ వివాదాలు, పట్టాదారు పాస్‌బుక్కులు, కుల, ఆదాయ, నివాస ధృవీకరణ పత్రాలు మరియు ఇతర అత్యవసర రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం వచ్చిన వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు, రైతులు కార్యాలయ ప్రాంగణంలోనే గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది.

*నీరుగారుతున్న ప్రభుత్వ ఆశయాలు:*

పాలనను ప్రజల ముంగిటకే తీసుకెళ్లాలని ప్రభుత్వం ప్రత్యేకంగా కేటాయించిన రోజునే అధికారులు సమయపాలన పాటించకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. “ప్రతి సోమవారం గ్రీవెన్స్ కార్యక్రమానికి తప్పకుండా హాజరుకావాలని ప్రభుత్వం కఠిన ఆదేశాలు ఇస్తున్నా.. సూళ్లూరుపేటలో మాత్రం సమాధానం చెప్పే నాథుడే కరువయ్యాడు” అని దూర ప్రాంతాల నుండి ప్రయాణ ఖర్చులు భరించి వచ్చిన బాధితులు వాపోతున్నారు.సమయపాలన, బాధ్యతాయుతమైన విధి నిర్వహణలో ఘోరంగా విఫలమవుతూ.. ప్రభుత్వంపై ప్రజల్లో ప్రతికూల భావన కలిగేలా వ్యవహరిస్తున్న అధికారులపై జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని సూళ్లూరుపేట ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇకనైనా అధికారులు సమయానికి హాజరై వినతులు స్వీకరించేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.