పలమనేరు, ఆగస్టు 09 ( గరుడ ధాత్రి ) :
పలమనేరు పట్టణంలోని పవిత్ర శ్రీ బసవేశ్వర స్వామి దేవస్థాన ప్రాంగణంలో “సంవేదన సేవా ట్రస్ట్” ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం శ్రేయోభిలాషుల సమావేశం నిర్వహించారు. సమాజ శ్రేయస్సు, జాతీయవాద కార్యకర్తల కుటుంబాల సంక్షేమం మరియు సేవా విస్తరణే ధ్యేయంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రధాన ఉపన్యాసకులుగా సంవేదన సేవా ట్రస్ట్ ప్రాంత అధ్యక్షులు శ్రీనివాస్ హాజరై ప్రసంగించారు. జాతీయవాద సంస్థలలో తమ అమూల్యమైన జీవితాలను, సమయాన్ని దేశం కోసం కేటాయించిన కార్యకర్తల కుటుంబాలకు అండగా నిలవడమే ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. ఆపదలో ఉన్న కుటుంబాలను ఆదుకోవడం, ఆర్థిక భరోసా కల్పించడం మరియు స్వయం ఉపాధి శిక్షణ ద్వారా వారిని ఆర్థికంగా నిలబెట్టడం సంవేదన సేవా ట్రస్ట్ ప్రాథమిక లక్ష్యాలని ఆయన వివరించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న పలమనేరు పరిరక్షణ సమితి గౌరవ అధ్యక్షులు మరియు ఎన్జీఓ సంఘ అధ్యక్షులు కె. ఆనందబాబు గారు మాట్లాడుతూ… దధీచి మహర్షి త్యాగాన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ సామాజిక సంవేదనతో నిలబడాలని పిలుపునిచ్చారు. “సాధన చేయాలి – సంవేదన కావాలి” అనే నినాదంతో సమాజంలో కష్టాల్లో ఉన్నవారి కన్నీళ్లు తుడవడానికి ప్రతి ఒక్క శ్రేయోభిలాషి ఈ ధర్మ యజ్ఞంలో భాగస్వామి కావాలని కోరారు. పరమ్ వీర్ చక్ర పతకంలో దధీచి మహర్షి వజ్రాయుధం చిహ్నం ఏ విధంగా అమర్చబడిందో వివరిస్తూ, దేశం కోసం త్యాగం చేసిన వారి సేవలు అమరమైనవని కొనియాడారు.
ఈ సమావేశంలో పూజ్య శ్రీ కేశవానంద స్వామి గారు (బ్రహ్మానంద గిరి ఆశ్రమం, బంగారుపాళ్యం) ఆశీఃప్రసంగం చేస్తూ… మానవ సేవయే మాధవ సేవ అని, నిస్వార్థ సేవతోనే సమాజంలో శాంతి, సుభిక్షత చేకూరుతాయని ఆశీర్వచనాలు అందించారు.
కార్యక్రమంలో ఆత్మీయ అతిథి జి.ఆర్. విజయ్ శంకర్, చిత్తూరు జిల్లా సంయోజక్ సతీష్ కృష్ణమూర్తి పాల్గొన్నారు.ఈ సమావేశంలో ప్రముఖ నాయకులు, సేవకులు వీరాధి విజయ్ కుమార్,ఉమా మహేష్, రామన్న, రాజేంద్ర, శ్రీపురం సీతారామయ్య లతో పాటు పలమనేరు మరియు చుట్టుపక్కల ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో శ్రేయోభిలాషులు, దేశసేవకులు, స్వచ్ఛంద కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు.