మానవత్వం కోసం ఎదురుచూస్తున్న ఓ అభాగ్యురాలు..
రామచంద్రపురం గరుడధాత్రి :
ఎక్కడి నుంచి వచ్చిందో… ఎవరు ఆమె కుటుంబ సభ్యులో… ఏ పరిస్థితుల్లో ఇక్కడికి చేరుకుందో ఎవరికీ తెలియదు. కానీ రామచంద్రపురం మండలం ఎమ్మార్వో కార్యాలయం సమీపంలోని ఓ పెద్ద చెట్టు కిందే ఆమె జీవితం సాగుతోంది. అదే చెట్టు ఆమెకు ఇల్లు, అదే నీడ ఆమెకు ఆశ్రయం. ఆకలి వేస్తే ఎవరైనా దయతో ఇచ్చిన ఆహారమే ఆమెకు భోజనం. ఎవరూ ఇవ్వకపోతే పస్తులతోనే రోజును గడుపుతోంది. అయినప్పటికీ, అక్కడే ఉన్న నాగాలమ్మ ఆలయ పరిసరాలను శుభ్రం చేస్తూ కనిపించడం స్థానికులను కదిలిస్తోంది. తన కష్టాలను మరిచి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రయత్నించే ఆమెను చూసిన ప్రతి ఒక్కరి మనసు చలించిపోతోంది. వర్షం వచ్చినా, ఎండ మండినా ఆ చెట్టు కిందే కాలం గడుపుతున్న ఆమెకు కనీస రక్షణ కూడా లేకపోవడం బాధాకరం. వృద్ధాప్యంలో ఆసరా లేక ఒంటరి జీవితాన్ని గడుపుతున్న ఈ మహిళకు తక్షణమే అధికారులు, స్వచ్ఛంద సంస్థలు లేదా వృద్ధాశ్రమ నిర్వాహకులు చేయూతనివ్వాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. సమాజంలో మానవత్వం ఇంకా సజీవంగానే ఉందని నిరూపించేలా ఈ అభాగ్యురాలికి ఓ భరోసా కల్పించి, ఆమె జీవితంలో కొత్త వెలుగు నింపాలని స్థానికులు కోరుతున్నారు.