GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 20 July 2026, 7:06 pm Posted by : GURU SWAMY

రైతుకు గిట్టుబాటు ధర కల్పించడమే లక్ష్యం : మార్కెట్ కమిటీ చైర్మన్ రాజన్న

పలమనేరు, జులై 20 ( గరుడ ధాత్రి ) :

రైతులు తమ పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు పొందేలా చర్యలు తీసుకోవడమే మార్కెట్ కమిటీ లక్ష్యమని పలమనేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజన్న తెలిపారు. సోమవారం పలమనేరు మార్కెట్ యార్డులోని టమోటా మండీల వద్ద జరుగుతున్న వేలం ప్రక్రియను మార్కెట్ కార్యదర్శి సంజీవ్ కుమార్‌తో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రాజన్న మాట్లాడుతూ, రైతులు తీసుకొచ్చే పంటలకు నాణ్యత ఆధారంగా గిట్టుబాటు ధరలు లభించేలా నిరంతరం కృషి చేస్తామని చెప్పారు. అలాగే మండీ యజమానులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా శాంతియుతంగా వ్యాపారం చేసుకునేందుకు మార్కెట్ కమిటీ పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. రైతులకు గానీ, మండీ వ్యాపారులకు గానీ ఎటువంటి సమస్యలు ఎదురైనా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు. ప్రస్తుతం పలమనేరు మార్కెట్‌లో టమోటాలకు నాణ్యతను బట్టి మంచి ధరలు లభిస్తున్నాయని పలువురు రైతులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ సిబ్బంది లోకేష్ తదితరులు పాల్గొన్నారు.