అమ్మవారి కల్యాణాన్ని తిలకించడానికి కదలి వచ్చిన భక్త జనసంద్రం
వేదమంత్రాలతో సాంప్రదాయ బద్ధంగా సాగిన కళ్యాణ తంతు
ఆలయానికి పోటెత్తిన విరాళాలు
రామచంద్రాపురం, జూలై 20 గరుడధాత్రి : రామచంద్రాపురం మండలంలో నిలువు రాళ్ల కమ్మపల్లి గ్రామంలో వెలసివున్న శ్రీకృష్ణ పాండవుల సమేత ధర్మరాజుల ఆలయంలో 60వ మహాభారత వార్షికోత్సవాలలో భాగంగా నాలుగవ రోజైన సోమవారం ఆది గర్భేశ్వరి శ్రీ ద్రౌపతి మాత కళ్యాణం మంగళ వాయిద్యాల మధ్య కమనీయంగా,కడు రమణీయంగా సాగింది. వేదమంత్రాలతో పౌరోహితులు మాడభూషిత రాజగోపాల్ అయ్యంగార్ ,ప్రదీప్ అయ్యంగార్ల బృందం కళ్యాణ తంతును ఎంతో సాంప్రదాయ బద్దంగా నిర్వహించారు. కళ్యాణం లో ప్రధాన ఘట్టమైన ఎదురుకోలు సన్నివేశాన్ని చక్కటి లయబద్ధకమైన నాట్యంతో అందరిని ఆనంద పరవశులు గావించారు. కళ్యాణ వేదికను దివంగత అర్చకులు బ్రహ్మర్షి వెంకటరత్నం ఆచారి దివ్య ఆశీస్సులతో ప్రధాన అర్చకులు హరి స్వామి అర్చకులు అరవింద ఆచార్యులు స్వామివారి శిష్య బృందం నానావిధ పరిమళ పుష్పాల తోరణాలతో ఎంతో చక్కగా అలంకరించారు.కళ్యాణ మండపాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అమ్మగారి పల్లికి చెందిన సుబ్బరామనాయుడు తొలిసమ్మ కుటుంబ సభ్యులు సతీష్ ,లైలా దంపతులు ఉభయ దారులుగా అమ్మవారికి కుమ్మరిలతో చేయబడిన అరిమేని కుండలను వివిధ రకాల పిండి వంటలు,నానా విధ పండ్లు,పట్టు వస్త్రాలతో సారే సమర్పించారు.పలువురు దంపతులు నిర్ణీత రుసుము చెల్లించి కళ్యాణంలో పాల్గొన్నారు.ఉభయ దారుల కుటుంబం మూడు పూటలా భక్తులకు పెద్ద ఎత్తున అన్న ప్రసాద వితరణ గావించారు. కళ్యాణానికి వచ్చిన వారందరికీ పసుపు దారం,పసుపు కుంకుమ,పండ్లు పంచిపెట్టారు. పాబోలు వంశీకులు సాయి ప్రసాద్ బాబు ,బాలాజీ, పార్థసారథి భక్తుల వద్ద విరాళాలను అందిపుచ్చుకొని ఎప్పటికప్పుడు మైక్ లో ప్రకటిస్తూ మరింత మందిని చైతన్యపరిచారు.ధర్మకర్తలు రమేష్ బాబు ,రవికుమార్ లు గ్రామ పెద్దలతో కలిసి ఆలయం వద్ద భక్తులకు ఎలాంటి లోటు రాకుండా చర్యలు చేపట్టారు. అమ్మవారి కళ్యాణాన్ని తిలకించటానికి వచ్చిన భక్తులతో ఆలయం జనసంద్రంగా మారింది.
వీనుల విందుగా హరికథ గానం:
పంచమ వేద 60వ మహాభారత ఉత్సవాలలో నాలుగవ రోజు మధ్యాహ్నం హరికథ భాగవతారిణి స్వర్ణలత ద్రౌపతి స్వయం వరాన్ని చక్కటి గాత్రంతో వినిపించారు.దృపదుని ఇంట యజ్ఞ కుండలిలో జన్మించిన శ్రీ ద్రౌపతి అమ్మవారిని అర్జునుడు స్వయంవరంలో మత్స్య యంత్రాన్ని ఛేదించి వివాహం చేసుకున్నాడు.పాండవుల తల్లి కుంతీదేవి ఆజ్ఞతో ఐదుగురు పాండవులకు ద్రౌపతి ధర్మపత్ని అయింది.ద్రౌపతి స్వయంవరం కథనం నేపథ్యంగా తీసుకుని శ్రీ వెంకటేశ్వర నాట్య కళామండలి వారు కిరణ్ బృందం రాత్రి చక్కటి పౌరాణిక నాటక ప్రదర్శన గావించారు.ద్రౌపతి కళ్యాణం సందర్భంగా ప్రధాన అర్చకులు హరి స్వామి, అర్చకులు అరవింద ఆచార్యులు,స్వామివారి శిష్య బృందం,ఘన ఆచార్యులు
,బటాచార్యులు ఈశాన్య భాగంలో ఉన్న బావి నుంచి పోతురాజులు స్వామి తోడురాగా తంబల మేళాలతో , దివిటీ వెలుగులలో పవిత్ర జలాన్ని తీసుకొని వచ్చి ఆలయంలోని సపరివార దేవతలకు ప్రత్యేక పూజలు చేసి మూడు పూటలా ధూప దీప నైవేద్యాలు సమర్పించారు.