GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 21 July 2026, 7:16 pm Posted by : GURU SWAMY

నీట్ పేపర్ లీకేజీలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి

ఢిల్లీలో శాంతియుత నిరసనకారులపై పోలీసుల దాడిని ఖండిస్తూ సిపిఎం-సిపిఐ నిరసన.

నీట్ పేపర్ లీకేజీలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని, ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద 21 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న పర్యావరణ ఉద్యమకారుడు సోనం వాంగ్‌చుక్‌ను చర్చలకు కూడా పిలవకుండా పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి ఆసుపత్రికి తరలించడం, అనంతరం శాంతియుతంగా దీక్ష కొనసాగిస్తున్న ఉద్యమకారులపై లాఠీచార్జ్ చేయడాన్ని నిరసిస్తూ నేడు తిరుపతిలో పాత మున్సిపల్ కార్యాలయం వద్ద సిపిఎం–సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ జిల్లా కార్యదర్శి పీ. మురళి, సిపిఎం నగర కార్యదర్శి కే. వేణుగోపాల్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన హక్కు అని అన్నారు. ఆ హక్కును గౌరవించాల్సిన కేంద్ర ప్రభుత్వం చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించకుండా అరెస్టులు, లాఠీచార్జ్‌లతో ఉద్యమాలను అణచివేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. సోనం వాంగ్‌చుక్‌ను చర్చలకు ఆహ్వానించకుండా బలవంతంగా ఆసుపత్రికి తరలించడం, ఆయనకు మద్దతుగా దీక్ష చేస్తున్న వారిపై పోలీసులు బలప్రయోగం చేయడం కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని అన్నారు.

దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న నీట్ పరీక్షలో పదేపదే పేపర్ లీకేజీలు జరగడం అత్యంత ఆందోళనకరమని తెలిపారు. ఇలాంటి ఘటనలు విద్యార్థులు, తల్లిదండ్రుల్లో విద్యా వ్యవస్థపై విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నాయని చెప్పారు. ఈ పరిస్థితికి పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని, నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి అసలు దోషులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని, దేశంలో పోటీ పరీక్షలను పారదర్శకంగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలని కోరారు. ప్రజాస్వామ్య హక్కులను అణచివేయడం ద్వారా ప్రజల గొంతును మూయలేరని, విద్యార్థులు, యువజనులు, ప్రజాసంఘాల న్యాయమైన ఉద్యమాలు కొనసాగుతూనే ఉంటాయని తెలిపారు.

ఈ నిరసన కార్యక్రమంలో సిపిఎం సిపిఐ నాయకులు కే రాధాకృష్ణ,పీ బుజ్జి, ఎన్ డి రవి,ఎం నరేంద్ర,చంద్రశేఖర్ రెడ్డి,ఎం జయంతి, శివ,బి శ్రీరాములు,ఏపీ బాల,జి వాసు, జింక నాగరాజు, నారాయణస్వామి, పద్మనాభ రెడ్డి, కేశవులు,కాలయ్య, సిద్దు, రామచంద్రయ్య, రామకృష్ణ, మంజులమ్మ, ప్రమీల విజయ రాము ఖాజావలి సురేష్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.