-గ్రామాన్ని సందర్శించి, సమస్యను పరిష్కరించాలని అధికారులను కోరిన కాంగ్రెస్ నేత కిరణ్ కుమార్
సూళ్లూరుపేట, సెప్టెంబర్ 22 గరుడధాత్రి న్యూస్ :
సూళ్లూరుపేట మండలం ఆబాక గ్రామం గత రెండు నెలలుగా వీధి దీపాలు లేక చీకటిలో మగ్గిపోతోంది. సాయంత్రం చీకటి పడిన తర్వాత గ్రామంలోని వీధుల్లో ఒక్క వీధి దీపం కూడా వెలగకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో మహిళలు, చిన్నపిల్లలు బయటకు రావాలంటేనే భయపడుతున్న పరిస్థితి నెలకొంది.
వీధుల్లో చీకటి కారణంగా పాములు, తేళ్లు, ఇతర విషపురుగుల సంచారం పెరిగిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు రాత్రివేళల్లో బయటకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వీధి దీపాల సమస్యను పలుమార్లు పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాకపోవడంతో స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
గ్రామాన్ని సందర్శించిన కాంగ్రెస్ నేత కిరణ్ :
ఆబాక గ్రామంలో వీధి దీపాల సమస్యపై సమాచారం తెలుసుకున్న సూళ్లూరుపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ డి. కిరణ్ కుమార్ వెంటనే స్పందించారు. ఆబాక గ్రామాన్ని సందర్శించి స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలోని వీధుల్లో పర్యటించి వీధి దీపాల పరిస్థితిని స్వయంగా పరిశీలించారు.
తదుపరి మండల అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కు వినతిపత్రం అందజేసి, గ్రామంలో వీధి దీపాలను తక్షణమే మరమ్మతులు చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ సందర్భంగా కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. “ఆబాక గ్రామంలోని వీధి దీపాలన్నింటినీ 48 గంటల్లో మరమ్మతు చేసి వెలిగించాలని అధికారులను కోరాం. చీకటి కారణంగా గ్రామంలో ఎలాంటి ప్రమాదం జరిగినా, పాము కాటు వంటి ఘటనలు చోటుచేసుకున్నా ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి. సమస్య పరిష్కారం కాకపోతే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గ్రామస్తులతో కలిసి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపడతాం. ప్రజా సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుంది” అని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు కన్నంబాకం హరికృష్ణ, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు జోగి వినోద్, సూళ్లూరుపేట నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు కే. శ్వేత, దొరవారిసత్రం మండల మహిళా అధ్యక్షురాలు ఎం. చాముండేశ్వరి, సూళ్లూరుపేట టౌన్ వైస్ ప్రెసిడెంట్ ఎస్.కె. యాసిన్ భాష, నియోజకవర్గ కార్యదర్శి బొగ్గుల సురేష్ తదితరులు పాల్గొన్నారు.
