• అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారి పట్ల కఠినంగా ఉంటాం
• నాయకులకి ఫ్లెక్సీల ఏర్పాటు మీద కంటే పని మీద శ్రద్ధ ఉండాలి
• విద్యార్ధుల ఆలోచనలు, ఆవిష్కరణలు వెలుగులోకి తెచ్చే వేదిక అవసరం
• కాకినాడలో మన ఊరు.. మాటా మంతి కార్యక్రమంలో ప్రజల నుంచి నేరుగా సమస్యలు తెలుసుకున్న రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్
‘ఇది కూటమి ప్రభుత్వం. రౌడీలు గూండాలను వెనకేసుకొచ్చే ప్రభుత్వం కాదు. అసాంఘిక కార్యకలాపాలకు ఎవరు పాల్పడినా చర్యలు కఠినంగా ఉంటాయి. 21 ఏళ్ల కసబ్ పాకిస్థాన్ నుంచి వచ్చి ఎంతో మంది ప్రాణాలు తీసేశాడు. వయసు చిన్నది పోనీలే పాపం అనుకోవడానికి వీల్లేదు. యువత బాధ్యతగా వ్యవహరించాలి. మీరు బలంగా ఉంటేనే సమాజంలో నేరాల సంఖ్య తగ్గుతుంద’ని రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం శాంతిభద్రతల నిర్వహణను అమలు చేస్తుందని తెలిపారు. శనివారం సాయంత్రం కాకినాడలో నిర్వహించిన మన ఊరు.. మాటా మంతి కార్యక్రమంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు పాల్గొన్నారు. ప్రజల సమస్యలు నేరుగా విన్నారు.
కాకినాడ బాలాజీ చెరువు ప్రాంతానికి చెందిన శ్రీ గంజాల అరవింద్ బాబు అనే వ్యక్తి కాకినాడ పట్టణంలో మితిమీరిన వేగంతో వాహనాలు నడుపుతూ ఇబ్బందిపెడుతున్న ఆకతాయిల వ్యవహారంపై ఫిర్యాదు చేయగా, ఆ అంశంపై స్పందించారు. కనస్ట్రక్షన్ కంపెనీ చేతిలో మోసపోయిన శ్రీమతి భవానీ అనే మహిళ, కాకినాడ సర్వజన ఆసుపత్రి బస్ షెల్టర్ వద్ద ఆక్రమణలపై శ్రీ మహ్మద్ అన్సర్ అనే వ్యక్తి, కళాశాలల్లో గంజాయి, మత్తుపదార్థాల అక్రమ రవాణా, విక్రయాలపై శ్రీనివాస్ అనే ఇంజినీరింగ్ విద్యార్థి, కాకినాడ నగరంలో అనధికారికంగా పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీల వల్ల ఇబ్బందులను శ్రీ ఎం. హరీష్ బాబు ఉపముఖ్యమంత్రివర్యుల దృష్టికి తీసుకువచ్చారు.
పిఠాపురం పట్టణంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ పాదగయ సెంటర్ వద్ద ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపాలని శ్రీ యనమండ్ర సూర్యనారాయణ ఫిర్యాదు చేశారు. ప్రతిరోజూ వేలాది మంది భక్తులు, వాహనాలతో ఈ ప్రాంతం అత్యంత రద్దీగా మారుతోంది. దీనివల్ల అత్యవసర సేవల వాహనాలు, అంబులెన్స్ లు సైతం గంటల తరబడి నిలిచిపోతున్నాయి. అత్యంత కీలకమైన ఈ కూడలిలో శాశ్వతంగా ఒక ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని కోరారు.
కాకినాడ కార్పోరేషన్ లో గత ప్రభుత్వ హయాంలో పనులు చేసి బిల్లులు రాక ఇబ్బందులుపడుతున్న కాంట్రాక్టర్లు,ప్రత్యేక క్లినిక్స్, టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని జాహ్నవి అనే ట్రాన్స్ జెండర్, గత ప్రభుత్వ హయాంలో జరిగిన రీసర్వేలో 45 సెంట్ల భూమిని కోల్పోయానిని కిర్లంపూడి మండలానికి చెందిన శ్రీ కాకిలేటి వీర్రాజు అనే వ్యక్తి తమ సమస్యలను శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువచ్చారు. నూతన ఆవిష్కరణలకు ప్రోత్సాహం కల్పించడంతోపాటు చదువు పూర్తయ్యాక రాష్ట్రంలోనే ఉద్యోగం కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లే దుస్థితి రాకుండా చూడాలని పలువురు విద్యార్ధులు విన్నవించారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో రాజకీయ నాయకులు ఫ్లెక్సీలు పెట్టేందుకు ఒకరి మీద ఒకరు పోటీపడుతున్నారు. ఆ శ్రద్ధ ఏదో పనిలో చూపిస్తే బాగుంటుంది. విచ్చలవిడిగా ఫ్లెక్సీలు వేసి ప్రజల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నామో అర్ధం కావడం లేదు. ఫ్లెక్సీల ఏర్పాటుపై వ్యవస్థల నియంత్రణ ఉండాలి. నిర్ణీత ప్రాంతాల్లో మాత్రమే వేసేలా చర్యలు తీసుకోవాలి. ప్రజలు కూడా ఇష్టారాజ్యంగా ఫ్లెక్సీలు పెట్టే రాజకీయ పార్టీలకు వచ్చే ఎన్నికల్లో ఓట్లు వేయమని చెప్పాలి. పాఠశాలల్లో ఆర్టీఈ యాక్ట్ అమలులో ఉన్న లోపాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తాం. విద్యా సంస్థలతో ఏమైనా సమస్యలు ఉంటే రెండు రోజుల్లో కలెక్టర్ గారికి ఫిర్యాదుల రూపంలో అందజేయండి. విద్యార్థుల ఆలోచనలు, ఆవిష్కరణలను వెలుగులోకి తెచ్చే విధంగా పార్లమెంటు సభ్యులంతా కలసి ఓ ప్రత్యేక వేదిక ఏర్పాటు చేయాల’ని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, శ్రీ కందుల దుర్గేష్ గారు, కూటమి పార్టీలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కాకినాడ కలెక్టర్ శ్రీ ఎం.ఎన్. హరీంధ్రప్రసాద్ గారు, ఎస్పీ శ్రీ జి.బిందు మాధవ్ గారు, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
