ePaper
Sunday, June 21, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్రూ.4.45 కోట్ల వ్యయంతో నిర్మించిన నూతన వంతెనను ప్రారంభించిన ఎమ్మెల్యే ఆదిమూలం

రూ.4.45 కోట్ల వ్యయంతో నిర్మించిన నూతన వంతెనను ప్రారంభించిన ఎమ్మెల్యే ఆదిమూలం

📰 Generate e-Paper Clip

రూ.4.45 కోట్లతో నిర్మించిన అరుణానది వంతెన ప్రారంభం

-ప్రారంభోత్సవం చేసిన ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం

పిచ్చాటూరు మండల ప్రజల చిరకాల నిరీక్షణకు తెరదించుతూ నారాయణరాజు కండ్రిగ సమీపంలో అరుణానదిపై రూ.4.45 కోట్ల వ్యయంతో నిర్మించిన నూతన వంతెనను గురువారం సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి వంతెనపై రిబ్బన్ కట్ చేసి ప్రజలకు అంకితం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఈ వంతెన నిర్మాణంతో పిచ్చాటూరు మండలంలోని 36 గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడతాయని తెలిపారు. ఇప్పటి వరకు నాగలాపురం పట్టణం లేదా తిరుపతి-చెన్నై జాతీయ రహదారిని చేరుకోవడానికి సుమారు 30 కిలోమీటర్ల మేర అదనపు ప్రయాణం చేయాల్సి వచ్చేదని, ఇప్పుడు కేవలం రెండు కిలోమీటర్ల దూరంలోనే ప్రధాన రహదారిని చేరుకునే అవకాశం కలిగిందన్నారు. దీంతో విద్యార్థులు, రైతులు, వ్యాపారులు, ఉద్యోగులు సహా వేలాది మందికి సమయం, ధనం ఆదా అవుతుందని పేర్కొన్నారు.
ఈ వంతెన నిర్మాణం ఈ ప్రాంత ప్రజల ఎన్నో ఏళ్ల కల అని, కూటమి ప్రభుత్వ సహకారంతో ఆ కలను సాకారం చేయగలిగామని ఎమ్మెల్యే తెలిపారు. నిర్ణీత కాలానికి ముందుగానే నాణ్యతతో పనులు పూర్తి చేసిన గుత్తేదారుని, పంచాయతీరాజ్ శాఖ అధికారులను ఆయన అభినందించారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందుతున్నాయని ఆయన పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం అనేక కష్టనష్టాలు పడి నిధులు మంజూరు చేయించుకుని పనులు చేపడుతుంటే, కొందరు వాటిని తమ ఘనతగా ప్రచారం చేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. అయితే నిజం ఏమిటో కాలమే నిరూపిస్తుందని, ప్రజలే తుది తీర్పు ఇస్తారని అన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో రాష్ట్ర పునర్నిర్మాణం వేగంగా జరుగుతోందని ఎమ్మెల్యే తెలిపారు.
అంతకుముందు ద్వారకానగర్ సమీపంలో అరుణానదిపై రూ.9 కోట్ల వ్యయంతో నిర్మాణంలో ఉన్న కాజ్‌వే పనులను ఎమ్మెల్యే పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఈఈ మధుసూదన్, డీఈ గోపాల్, ఏఎంసీ మాజీ చైర్మన్ ఇళంగోవన్ రెడ్డి, ఎంపీడీవో మహమ్మద్ రఫీ, తహసీల్దార్ చంద్రబాబు నాయుడు, నాయకులు పద్దు రాజు, సుమాంజలి, సెల్వకుమార్, ఎస్.ఎం. సురేష్, వెంకటరత్నం నాయుడు, రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!