ePaper
Monday, June 22, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్తిరుపతిలో కల్తీ ఆహారం, కుళ్ళిన మాంసం విక్రయాలపై సమగ్ర విచారణ జరపాలి

తిరుపతిలో కల్తీ ఆహారం, కుళ్ళిన మాంసం విక్రయాలపై సమగ్ర విచారణ జరపాలి

📰 Generate e-Paper Clip

-బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి
-జిల్లా కలెక్టర్‌కు సీపీఎం, సీపీఐ నాయకుల వినతి

తిరుపతి నగరంలో వరుసగా వెలుగులోకి వస్తున్న కల్తీ ఆహారం, నాసిరకం మాంసం, చేపల విక్రయాల ఘటనలు ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయని పేర్కొంటూ సీపీఎం, సీపీఐ నాయకులు జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న కల్తీ ఆహార మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని, సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు టి. సుబ్రహ్మణ్యం, సీపీఐ నగర కార్యదర్శి జె. విశ్వనాథం, సీపీఎం నగర కార్యదర్శి కె. వేణుగోపాల్ మాట్లాడుతూ గత పది రోజులుగా తిరుపతి నగరంలో వరుసగా బయటపడుతున్న ఘటనలు ఆహార భద్రతా వ్యవస్థ వైఫల్యాన్ని బట్టబయలు చేస్తున్నాయని అన్నారు. పి.పి. చావడిలో నెలల తరబడి నిల్వ ఉంచిన మేక తలలు, కాళ్లు, మేక మాంసం కుళ్లిపోయి దుర్వాసన వెదజల్లడం, ఎస్వీ యూనివర్సిటీ మొదటి గేటు వద్ద కుళ్లిపోయిన ఆహార పదార్థాలను వండి విక్రయించడం, చేపల మార్కెట్‌లో కుళ్లిపోయిన చేపలు, పురుగులు పట్టిన చేపలను విక్రయించడం, తాజాగా కేఎఫ్‌సీలో నాసిరకమైన ఆహార పదార్థాలు, కుళ్లిన మాంసం బయటపడడం వంటి ఘటనలు ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయని పేర్కొన్నారు.
ఆహార భద్రతా శాఖ, ఆరోగ్య శాఖ అధికారులు ఎక్కడ తనిఖీలు నిర్వహించినా గుట్టలుగా కుళ్లిపోయిన ఆహార పదార్థాలు బయటపడుతున్నాయని, ఇది విడివిడిగా జరిగిన ఘటనలు కాకుండా నగరవ్యాప్తంగా విస్తరించిన కల్తీ ఆహార మాఫియా కార్యకలాపాలకు నిదర్శనమని అన్నారు. తిరుపతికి ప్రతిరోజూ లక్షలాది మంది భక్తులు, పర్యాటకులు వస్తుంటారని, వారి ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
తిరుపతిలో జరుగుతున్న కల్తీ ఆహారం, నాసిరకం మాంసం విక్రయాల వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా జోక్యం చేసుకుని రాష్ట్రవ్యాప్తంగా ఆహార భద్రతా చర్యలను కట్టుదిట్టం చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల ప్రాణాలతో వ్యాపారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుని ఆదర్శప్రాయమైన శిక్షలు విధించాలని కోరారు.
జిల్లా కలెక్టర్‌కు సమర్పించిన వినతిపత్రంలో కల్తీ ఆహారం, నాసిరకం మాంసం విక్రయాలపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసి నిరంతర తనిఖీలు నిర్వహించాలని సీపీఎం, సీపీఐ నాయకులు విజ్ఞప్తి చేశారు.
వినతిపత్రాన్ని స్వీకరించిన జిల్లా కలెక్టర్ స్పందిస్తూ, ఈ అంశాన్ని అత్యంత సీరియస్‌గా పరిగణిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే ఫుడ్ సేఫ్టీ అధికారులు, ఆరోగ్య శాఖ అధికారులతో సమావేశం నిర్వహించినట్లు పేర్కొన్నారు. కల్తీ ఆహారం, నాసిరకం మాంసం విక్రయాలపై సమగ్రమైన విచారణ చేపట్టి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజల ఆరోగ్య రక్షణ విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం నగర కార్యదర్శివర్గ సభ్యురాలు పి బుజ్జి, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షురాలు బి. పవిత్ర, కె. తిమ్మప్ప తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!