కార్వేటినగరం ఆగస్టు 7 (గరుడ ధాత్రి):
బిడ్డకు తల్లిపాలే శ్రేయస్కరం సిడిపిఓ శోభారాణి అన్నారు. సిడి కండిగ సచివాలయంలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలకు తల్లిపాల ఆవశ్యకత, ప్రాముఖ్యతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. బిడ్డ పుట్టిన అరగంట లోపు తల్లీబిడ్డలకు స్పర్శను కల్పిస్తూ తప్పనిసరిగా ముర్రుపాలు పట్టించాలని సూచించారు. ముర్రుపాలు శిశువు పాలిట అమృతంతో సమానమని, అవి బిడ్డకు తొలి టీకాగా పనిచేసి జీవితాంతం రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయని వివరించారు.
పుట్టినప్పటి నుంచి కనీసం ఆరు నెలల పాటు శిశువుకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, అప్పుడే పిల్లలు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఎదుగుతారని స్పష్టం చేశారు. బిడ్డకు అవసరమైన అన్ని పోషకాలు, విటమిన్లు తల్లిపాలలోనే పుష్కలంగా ఉంటాయి. బయటి పాలు, డబ్బా పాలు వాడటం వల్ల పిల్లలు తరచూ అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉందన్నారు ముర్రుపాలు పారబోయకూడదని, అపోహలు విడనాడి ప్రతి తల్లీ తప్పనిసరిగా బిడ్డకు పాలివ్వడాన్ని ఒక బాధ్యతగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ రోజా రమణి, అంగన్వాడీ కార్యకర్తలు, మంజుల మమత, వైద్య సిబ్బంది కార్యకర్తలు, ఆయాలు, ఆశా వర్కర్లు మరియు పెద్ద సంఖ్యలో గర్భిణులు, బాలింతలు, గ్రామ మహిళలు పాల్గొన్నారు.
బిడ్డకు తల్లిపాలే శ్రేయస్కరం: సిడిపిఓ శోభారాణి
RELATED ARTICLES
