* సంక్షేమంతో పాటు అభివృద్ధి చేస్తున్నాం.
* బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం.
* చీరాల వరకు పర్యాటక కారిడార్.
* దేశం గర్వించదగ్గ కళ చేనేత.
* చీరాల సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.
కుప్పం,ఆగస్టు 07 (గరుడ ధాత్రి న్యూస్): చీరాలకు పూర్వ వైభవం తీసుకువస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం చీరాల నియోజకవర్గ కొత్తపేటలో 12వ జాతీయ చేనేత దినోత్సవం లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. నేతన్న సేవలో పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగించారు.చీరాల పేరు వింటేనే ఇక్కడి నేతన్నల నైపుణ్యం గుర్తుకు వస్తుందన్నారు. చీరాల పట్టు, కాటన్ చీరలు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాయన్నారు.. చీరాల ఖర్చీఫ్లు ఒకప్పుడు విదేశాలకు భారీగా ఎగుమతి అయ్యేవన్నారు. చేనేత ఉత్పత్తుల్లో ఒకప్పుడు ‘మినీ ముంబై’గా పేరొందిన చీరాలకు పూర్వ వైభవం తెస్తామన్నారు. చీరాల, వెంకటగిరి, ధర్మవరం, ఉప్పాడ, మంగళగిరి, పొందూరు, పెడన, శ్రీకాళహస్తి, నరసాపురం ఇలా రాష్ట్రంలో అనేక చేనేత ఉత్పత్తులు విశిష్ట గుర్తింపు పొందాయన్నారు. 1.27 లక్షల మంది చేనేత రంగంపై ఆధారపడి జీవిస్తున్నారన్నారు. సంప్రదాయం, సృజనాత్మకత కలగలిసిన అపూర్వమైన నైపుణ్యం వీరందరిలో కనిపిస్తుంది. నేతన్న సేవ పథకమే కాదు.ఇప్పటికే నేతన్నలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని అన్నారు.స్వదేశీ ఉద్యమ స్ఫూర్తిని గుర్తు చేసుకునేలా ఆగస్ట్ 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఇది మరపురాని రోజుగా ఉండాలనే ఈరోజు నేతన్న సేవలో పథకాన్ని ప్రారంభించామన్నారు.నేతన్న సేవలో పథకం కింద 71,536 కుటుంబాలకు రూ.25 వేల చొప్పున ఇస్తున్నాం. రూ.179 కోట్లు నేతన్నలకు అందిస్తున్నాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలే కాదు, చెప్పని వాటినీ అమలు చేస్తున్నాం అనడానికి నేతన్న సేవలో పథకమే నిదర్శనమన్నారు. చేనేత కేవలం ఒక వృత్తే కాదు భారతీయ సంస్కృతికి ప్రతీక. దేశం గర్వించే కళ చేనేత అని కొనియాడారు. మన రాష్ట్రం అనేక చేనేత కళలకు నిలయం. అలాంటి వర్గానికి ఆసరాగా ఉంటున్నామన్నారు.పారిశ్రామిక వేత్తలను ఆహ్వానించామని, రూ. 12 లక్షల కోట్ల మేర పెట్టుబడులు ఇప్పటికే గ్రౌండ్ అయ్యాయన్నారు. యువతకు ఉద్యోగాలు వచ్చేలా కృషి చేస్తున్నామన్నారు. అభివృద్ధి-ఉపాధి కల్పించేలా పారిశ్రామికాభివృద్ధి చేస్తున్నాం. రోడ్లు, పోర్టులు, విమానాశ్రయాలు కూడా రాష్ట్రంలో నిర్మించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నాం. పర్యాటకుల్ని ఆకట్టుకునేలా సూర్యలంక, బాపట్ల, చీరాల సముద్ర తీర ప్రాంతాలను తీర్చిదిద్దుతున్నాం. రూ. 97 కోట్ల స్వదేశ్ దర్శన్ నిధులతో సూర్యలంక నుంచి చీరాల వరకు పర్యాటక కారిడార్ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.రాష్ట్రంలో అందరికీ రూ.2.5 లక్షల చొప్పున యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకువస్తున్నాం. అభివృద్ధితో పాటు సంక్షేమం, సుపరిపాలనను అందించేలా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. పేదలు భోజనానికి ఇబ్బందులు పడకుండా రూ.5 అన్నా క్యాంటీన్లో భోజనం అందిస్తున్నాం. కొందరు వ్యక్తులు దీనికీ అడ్డం పడి అన్నా క్యాంటీన్లను ఎత్తేశారు. విద్య అందరికీ అందాలన్న లక్ష్యంతో తల్లికి వందనం పథకం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ వారి తల్లుల ఖాతాలో డబ్బులు జమ చేస్తున్నాం. సంక్షేమంతో పాటు అభివృద్ధిపైనా శ్రద్ధ పెడుతున్నాం. గత పాలనలో రోడ్లన్నీ గుంతలే. మన రాష్ట్రాన్ని చూసి ఎగతాళి చేశారు. ఇప్పుడు రోడ్లకు మరమ్మత్తులు చేశామన్నారు.అభివృద్ధిని అడ్డుకునేలా చేసే అరాచకాలను ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించం. ప్రజల కోసం కఠిన చర్యలకు వెనుకాడం. గంజాయి, బ్లేడ్ బ్యాచ్ లను నేరాలు, ఘోరాలు చేసే వ్యక్తుల్ని ప్రోత్సహిస్తున్నారు. యాక్సిడెంట్ చేస్తే గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తీసుకెళ్లాలి.కానీ ఆధారాలు తారుమారు చేసేసి, వ్యక్తులను మార్చేసి కుట్రలు చేసి కేసు మాఫీ చేసేందుకు ప్రయత్నించారు. 44 ఏళ్ల వ్యక్తి చనిపోతే ఇబ్బందేమిటని మాట్లాడతారు. ఇదెక్కడి విడ్డూరం. పరామర్శల కోసం గంటల పాటు రోడ్లను నిర్బంధించేసి వెకిలి చేష్టలు చేస్తున్నారు. శాంతి భద్రతలను కాపాడే ఓ మహిళా పోలీసు అధికారి విషయంలో అసభ్యంగా ప్రవర్తించారన్నారు.ఆంధ్రప్రదేశ్లోని చీరాల, బాపట్ల, సూర్యలంక తీర ప్రాంతాలు అత్యుత్తమ సముద్ర తీర ప్రాంతాలుగా రూపుదిద్దుకుంటున్నాయి. శనివారం వస్తే చాలు హైదరాబాద్ ఖాళీ అయిపోయి పర్యాటకులందరూ సూర్యలంక, చీరాల బీచ్ వైపే తరలివస్తున్నారు. మరో ‘గోవా’ ఎక్కడో లేదు, అది చీరాల నుంచి సూర్యలంక మధ్యలోనే ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ తీర ప్రాంతాల ప్రాముఖ్యతను గుర్తించి, పర్యాటకాన్ని మరింత ప్రోత్సహించి, ప్రాంతీయ అభివృద్ధిని పరుగులు తీస్తామని చంద్రబాబు పేర్కొన్నారు.చేనేత కుటుంబాలకు నెలకు 200 యూనిట్లు, పవర్లూమ్ యూనిట్లకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. 62,541 చేనేత కుటుంబాలు, 10,032 పవర్లూమ్ యూనిట్లకు ప్రయోజనం కలుగుతోంది. చేనేతలకు 50 ఏళ్లకే ఎన్టీఆర్ పెన్షన్ భరోసా పెన్షన్ అందిస్తున్నాం. 85 వేల మంది చేనేతలకు ఫించన్గా రూ.4 వేల చొప్పున నెలకు రూ.35 కోట్లు ఇస్తున్నాం. రూ.420 కోట్లు ఏడాదికి ఖర్చు పెడుతున్నాం. రాష్ట్రంలోని 109 ప్రాథమిక చేనేత సహకార సంఘాలకు క్యాష్ క్రెడిట్ ద్వారా రూ.79 కోట్లు ఇచ్చాం. స్మాల్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద రూ. 10 కోట్ల వ్యయంతో 10 చేనేత క్లస్టర్లకు ఆమోదం పొందాయి. హ్యాండ్లూమ్ మార్కెటింగ్ అసిస్టెన్స్ కార్యక్రమంతో నేత కార్మికులకు నేరుగా మార్కెట్ అవకాశాలు వచ్చాయన్నారు.ఉప్పాడలో ప్రత్యేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టు, మంగళగిరిలో హ్యాండ్లూమ్ పార్కు ఏర్పాటు చేస్తున్నాం. అమరావతిలోని శాఖమూరులో చేనేత, హస్తకళల మ్యూజియం కూడా వస్తోంది. విశాఖపట్నంలో రూ.4,200 కోట్ల పెట్టుబడితో సుస్థిర టెక్స్టైల్ రీసైక్లింగ్ యూనిట్ ఏర్పాటు కానుంది. వెనకబడిపోయిన బీసీ వర్గాలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది. చేపల వేట నిషేధ సమయంలో 1.34 లక్షల మత్య్సకార కుటుంబాలకు రూ.20 వేల చొప్పున రూ.505 కోట్లు ఇచ్చాం. వడ్డెరలకు మైనింగ్ లీజులు, గీత కార్మికులకు ఎక్సైజ్ షాపులు కేటాయించాం. సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటుకు బీసీలకు 3 కిలో వాట్లకు అదనంగా రూ.20 వేలు సబ్సిడీ ఇస్తున్నాం. బీసీల కోసం రక్షణ చట్టం తీసుకువస్తున్నాం. దీని ముసాయిదా సిద్ధమైందని అన్నారు. రాష్ట్ర బీసీ సంక్షేమ చేనేత శాఖల మంత్రి సవితమ్మ మాట్లాడుతూ, తెలుగుదేశం ప్రభుత్వం నాడు ఎన్టీఆర్ నేడు చంద్రబాబు వరకు చేనేత రంగ అభివృద్ధికి సంక్షేమానికి కృషి చేశారన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పనప్పటికీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేనప్పటికీ సీఎం చంద్రబాబు పథకాలు తీసుకువచ్చారన్నారు. కార్యక్రమంలో మంత్రులు గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్ ,పార్థసారథి తదితరులు పాల్గొన్నారు.
చీరాలకు పూర్వ వైభవం తీసుకువస్తాం
RELATED ARTICLES
