ePaper
Saturday, September 12, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్వినాయక చవితి ప్రశాంతంగా నిర్వహించాలి - ఎస్సై బి. రాఘవేంద్ర

వినాయక చవితి ప్రశాంతంగా నిర్వహించాలి – ఎస్సై బి. రాఘవేంద్ర

📰 Generate e-Paper Clip

మండపాలకు ఆన్‌లైన్ అనుమతి తప్పనిసరి.. డీజేలకు నో పర్మిషన్

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: ఎస్సై బి. రాఘవేంద్ర

పిచ్చాటూరు, సెప్టెంబర్ 5 గరుడధాత్రి :

వినాయక చవితి పండుగను ప్రజలు భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాల మధ్య ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని పిచ్చాటూరు ఎస్సై బి. రాఘవేంద్ర సూచించారు. పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
తిరుపతి జిల్లా ఎస్పీ ఆదేశాలు, పుత్తూరు డీఎస్పీ, పుత్తూరు రూరల్ సీఐ సూచనల మేరకు పిచ్చాటూరు మండలంలో వినాయక చవితి ఉత్సవాల నిర్వహణపై నిర్వాహకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై బి. రాఘవేంద్ర పండుగ నిర్వాహకులు, ప్రజలు పాటించాల్సిన నిబంధనలను వివరించారు.
వినాయక మండపాల ఏర్పాటుకు ఆన్‌లైన్ అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేశారు. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చిన సింగిల్ విండో ఈ-పోర్టల్ ద్వారా అనుమతులు పొందవచ్చని తెలిపారు. వివిధ శాఖల కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా అనుమతుల ప్రక్రియను ఆన్‌లైన్‌లో పూర్తి చేసుకోవచ్చన్నారు.
ప్రతి వినాయక మండపానికి ఐదుగురు ఆర్గనైజర్లు తప్పనిసరిగా ఉండాలని, మండపం వద్ద జరిగే కార్యకలాపాలకు వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా మండపాలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
మండపాల వద్ద డీజేలకు అనుమతి లేదని, మద్యం సేవించడం, మత్తు పదార్థాలు వినియోగించడం, జూదం వంటి కార్యకలాపాలకు పూర్తిగా నిషేధం ఉందన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే వాహనాలను సీజ్ చేయడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మండపాలను విద్యుత్ తీగలకు దూరంగా, సురక్షిత ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. షార్ట్‌సర్క్యూట్, అగ్నిప్రమాదాల నివారణకు నిర్వాహకులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. రహదారులకు అడ్డంగా మండపాలు ఏర్పాటు చేసి ప్రజలకు, వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలిగిస్తే చర్యలు తప్పవన్నారు.
వినాయక నిమజ్జనం సమయంలో లోతైన చెరువులు, గుంటలు, ప్రమాదకర నీటి ప్రాంతాలకు పిల్లలు, వృద్ధులను దూరంగా ఉంచాలని సూచించారు. నిమజ్జనం సందర్భంగా పోలీసుల సూచనలు, భద్రతా నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని కోరారు.
వినాయక చవితి వేడుకలు భక్తిశ్రద్ధలతో, ప్రశాంతంగా, సురక్షిత వాతావరణంలో నిర్వహించడమే పోలీసుల ప్రధాన లక్ష్యమని ఎస్సై బి. రాఘవేంద్ర తెలిపారు. పిచ్చాటూరు మండల ప్రజలందరికీ ముందస్తుగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!