ePaper
Monday, September 28, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిఅర్ధరాత్రి వెలసిన శిలాఫలకం.. ఇదేనా ఆధునికరణ..?

అర్ధరాత్రి వెలసిన శిలాఫలకం.. ఇదేనా ఆధునికరణ..?

📰 Generate e-Paper Clip

దశాబ్దాల నాటి పంచాయతీరాజ్‌ భవనానికి హఠాత్తుగా కొత్త శిలాఫలకం

సత్యవేడు రాజకీయాల్లో ఇదో కొత్త తరహా ‘కొసమెరుపు’.. అధికారుల స్పందనపై ఆసక్తి

సత్యవేడు, సెప్టెంబర్ 26 గరుడధాత్రి

దాదాపు ఏడు దశాబ్దాల నాటి పాత పంచాయతీరాజ్‌ భవనం… అప్పట్లో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో నిర్మించినట్లు స్థానికులు చెబుతున్న ఆ భవనానికి తాజాగా అర్ధరాత్రి వేళ కొత్త శిలాఫలకం వెలవడం సత్యవేడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఏళ్ల తరబడి ఎలాంటి హడావుడి లేకుండా ఉన్న పాత భవనానికి అకస్మాత్తుగా ‘ఆధునికరణ’ పేరుతో శిలాఫలకం ప్రత్యక్షం కావడం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ముఖ్యంగా ఈ కార్యక్రమం రాత్రివేళలో జరగడం పలు సందేహాలకు తావిస్తోంది.
ఇంతకీ ఆ శిలాఫలకం ఎవరి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు?
ఏ నిధులతో భవనానికి ఆధునికరణ చేపట్టారు?
పనులు ఎప్పుడు ప్రారంభమయ్యాయి?
అధికారిక అనుమతులు ఉన్నాయా?
అనే ప్రశ్నలు స్థానికుల నుంచి వినిపిస్తున్నాయి.
సత్యవేడు మండలంలో ఎంతోమంది జడ్పీటీసీలుగా పనిచేసి పదవీకాలం పూర్తి చేసుకుని మాజీ జడ్పీటీసీలుగా మారారు. అయితే తాజాగా చోటుచేసుకున్న ఈ ఘటన మాత్రం రాజకీయ వర్గాల్లో “బలే బలే… ఇదేం కొత్త రాజకీయం?” అనే చర్చకు దారితీస్తోంది.
ప్రజలకు తెలియాల్సిన అభివృద్ధి పనులు పగటిపూట పారదర్శకంగా జరగాల్సి ఉండగా, అర్ధరాత్రి వేళ శిలాఫలకం ప్రత్యక్షం కావడంపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. భవనానికి నిజంగా ఆధునికరణ పనులు జరిగాయా? లేక కేవలం శిలాఫలకంతోనే సరిపెట్టారా? అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి.
ఈ వ్యవహారంపై సంబంధిత పంచాయతీరాజ్‌ అధికారులు, స్థానిక అధికారులు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు. శిలాఫలకం ఏర్పాటు వెనుక ఉన్న వాస్తవాలు ఏమిటో, దానికి సంబంధించిన ప్రభుత్వ రికార్డులు ఏమి చెబుతున్నాయో అధికారులు వెల్లడిస్తే అన్ని అనుమానాలకు తెరపడే అవకాశం ఉంది.
అర్ధరాత్రి శిలాఫలకం వెలసిన ఈ ‘ఆధునికరణ’ కథపై అధికారుల సమాధానం ఏమిటో వేచి చూడాలి!

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!