నేడు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు
మధ్యాహ్నం 2 గంటల నుంచి ఏకం క్షేత్రంలో అంతిమయాత్ర
నివాళులర్పించిన నిత్యామీనన్, ఎమ్మెల్యేలు ఆదిమూలం, విజయశ్రీ, శ్రీ సిటీ ఎండీ
కిక్కిరిసిన ఏకం క్షేత్రం.. విషాదంలో లక్షలాది మంది భక్తులు
వరదయ్యపాళ్యెం అక్టోబర్ 2 గరుడధాత్రి :
ఆధ్యాత్మిక గురువు, ఏకం క్షేత్రం (వన్నెస్ యూనివర్సిటీ) వ్యవస్థాపకులు కల్కి భగవాన్ పార్థివదేహానికి ప్రముఖులు, భక్తులు అశ్రునయనాలతో తుది వీడ్కోలు పలుకుతున్నారు. ఆయన అంత్యక్రియలను శుక్రవారం ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం బత్తలవల్లిలోని ఏకం క్షేత్రంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అంతిమయాత్ర నిర్వహించనున్నారు.
-కడచూపు కోసం ప్రముఖుల రాక
కల్కి భగవాన్ పార్థివదేహాన్ని దర్శించుకునేందుకు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఏకం క్షేత్రానికి తరలివచ్చారు. ప్రముఖ సినీనటి నిత్యామీనన్ ఆయన భౌతికకాయాన్ని దర్శించుకుని పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. ఆమెతో పాటు సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, శ్రీ సిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కళ్యాణ్ చక్రవర్తి తదితరులు కల్కి భగవాన్‌కు తుది నివాళులర్పించారు.
వీరితో పాటు పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, ఆధ్యాత్మికవేత్తలు ఏకం క్షేత్రానికి చేరుకుని నివాళులర్పించారు.
-కిక్కిరిసిన ఏకం క్షేత్రం
కల్కి భగవాన్ మరణవార్తతో ఆయన అనుచరులు, భక్తులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కడచూపు కోసం దేశ, విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఏకం క్షేత్రం పరిసరాలు కిక్కిరిసిపోయాయి. భక్తుల కన్నీటి వీడ్కోలుతో అక్కడ విషాద వాతావరణం నెలకొంది.
లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో అంతిమయాత్ర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసి భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టారు.
