చౌడేపల్లి అక్టోబర్ 30 గరుడ దాత్రి న్యూస్
విద్యార్థులు కేవలం చదువుపైనే కాకుండా తమ వ్యక్తిత్వ వికాసంపై దృష్టి పెట్టాలని పలువురు ప్రముఖ విద్యావేత్తలు పిలుపునిచ్చారు. స్థానిక పాఠశాల నిర్వహించిన ఒక కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా గణితశాస్త్ర అధ్యాపకులు మునిరాజా మాట్లాడుతూ, నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులు తమ వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవడం చాలా అవసరమని అన్నారు. భావోద్వేగాలను నియంత్రించుకుంటూ, సృజనాత్మక శక్తిని పెంచుకోవాలని కోరారు. అలాగే, ప్రతి విద్యార్థి సకారాత్మక ఆలోచనా విధానాన్ని అలవర్చుకోవాలని సూచించారు.
భౌతికశాస్త్ర అధ్యాపకులు ఆనంద్ సార్ మాట్లాడుతూ, విద్యార్థి దశ నుంచే మంచి అలవాట్లను అలవర్చుకోవడం చాలా ముఖ్యమని అన్నారు. విద్యార్థులలో అసూయ, ద్వేషం, కోపం వంటి ప్రతికూల భావాలకు తావు ఉండకూడదని తెలిపారు. మంచి గుణాలను అలవర్చుకుని సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా ఎదగాలని కోరారు. కల్యాణి భారతిలు మాట్లాడుతూ, జీవితంలో విజయాలు అపజయాలు సహజమని అన్నారు. వీటిని సమానంగా స్వీకరించాలని తెలిపారు. అపజయం ఎదురైనప్పుడు కుంగిపోకుండా, యోగా మరియు ధ్యానం వంటి వాటి ద్వారా మనస్సును ప్రశాంతంగా ఉంచుకుని, మళ్లీ ప్రయత్నించి విజయం సాధించాలని ఆమె వివరించారు.
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు దిశానిర్దేశం చేసిన అధ్యాపకులను వారు అభినందించారు.
