*ఉపాధి హామీ పథకంలో కీలక మార్పులు*
*మే 1 నుంచి కొత్త రూపంలో అమలు*
కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ఉపాధి రంగంలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. దశాబ్దాలుగా అమలులో ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) ఇకపై “VB GRAMJI (వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవికా మిషన్)”గా మే 1 నుంచి అమల్లోకి రానుంది. పేరు మార్పుతో పాటు పథకం అమలు విధానంలో కూడా విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చినట్లు కేంద్రం ప్రకటించింది.
కొత్త పథకం ప్రకారం, ప్రతి కుటుంబానికి ఇచ్చే పని దినాలను 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచారు. దీనివల్ల గ్రామీణ కూలీలకు వార్షిక ఆదాయం పెరిగే అవకాశముంది. అలాగే, పనుల ఎంపికలో గ్రామ పంచాయతీలకు పూర్తి అధికారం ఇవ్వడం మరో ముఖ్య నిర్ణయం. ఇప్పటివరకు మండల స్థాయి అధికారుల ఆధిపత్యం ఉండగా, ఇకపై స్థానిక అవసరాల ఆధారంగా పంచాయతీలు స్వయంగా పనులను నిర్ణయించగలవు.
ఇక పనుల విస్తరణలో భాగంగా మట్టి పనులతో పాటు అంగన్‌వాడీ భవనాలు, పాఠశాల టాయిలెట్లు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, చెక్‌డ్యామ్‌లు వంటి శాశ్వత నిర్మాణాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. మొత్తం 266 రకాల పనులను కొత్త జాబితాలో చేర్చినట్లు అధికారులు తెలిపారు.
అయితే, రైతులకు మేలు చేసిన కొన్ని పనులను తొలగించడం చర్చనీయాంశమైంది. చెరువుల నుంచి పొలాలకు ఒండ్రుమట్టి తరలింపు, వ్యక్తిగత పొలాల్లో భూమి చదును, పిచ్చి మొక్కల తొలగింపు వంటి పనులకు ఇకపై అనుమతి ఉండదని స్పష్టం చేశారు. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం అమలులో ఉన్న పనులన్నీ ఏప్రిల్ 30లోపు పూర్తి చేయాలని కేంద్ర మార్గదర్శకాలు సూచించడంతో గ్రామీణ ప్రాంతాల్లో ఉత్కంఠ నెలకొంది. పనులను గడువులోగా పూర్తి చేయాలని క్షేత్రస్థాయి సిబ్బందిపై ఒత్తిడి పెరుగుతోంది. అయితే ఎస్సీ, ఎస్టీ రైతులకు భూ అభివృద్ధి పనుల్లో కొంత మినహాయింపు లభించే అవకాశం ఉంది.
గ్రామీణ ఉపాధి రంగంలో ఈ మార్పులు ఎలా ప్రభావం చూపుతాయన్నది మే 1 తర్వాత స్పష్టత రానుంది.
