సత్యవేడు, జూన్ 20 గరుడధాత్రి :
రైతులకు వ్యవసాయ పెట్టుబడి భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేస్తోందని సత్యవేడు జడ్పీటీసీ సభ్యురాలు కూరపాటి విజయలక్ష్మి అన్నారు. శనివారం స్థానిక వ్యవసాయ ఏడీ కార్యాలయంలో వ్యవసాయ ఏడీ సుబ్రమణ్యం ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాత సుఖీభవ -పీఎం కిసాన్ మెగా చెక్కు పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొని రైతులకు చెక్కులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ పథకాల ద్వారా రైతులకు ప్రతి ఏడాది రూ.20 వేల ఆర్థిక సహాయం అందుతున్నట్లు తెలిపారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం రూ.14 వేలు, కేంద్ర ప్రభుత్వం రూ.6 వేలు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నట్లు వివరించారు.
రైతుల ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వం రాయితీ ధరలపై విత్తనాలు, వ్యవసాయ పనిముట్లు అందిస్తోందని పేర్కొన్నారు. పంట నష్టపరిహారం, వ్యవసాయ సబ్సిడీలు పొందాలంటే రైతులు తప్పనిసరిగా ఈ-క్రాప్ నమోదు చేసుకోవాలని సూచించారు.
2026-27 సంవత్సరానికి తొలి విడతలో నియోజకవర్గ పరిధిలో 29,653 మంది రైతులకు రూ.14.83 కోట్లు, పీఎం కిసాన్ పథకం కింద 26,504 మంది లబ్ధిదారులకు రూ.5.03 కోట్లు జమ అయ్యాయని తెలిపారు. మొత్తం రూ.20 కోట్లకు పైగా రైతుల ఖాతాల్లో జమ అయినట్లు పేర్కొన్నారు.
సత్యవేడు మండలంలో అన్నదాత సుఖీభవ పథకం కింద 3,417 మంది రైతులకు రూ.1.71 కోట్లు, పీఎం కిసాన్ కింద 3,074 మంది లబ్ధిదారులకు రూ.61 లక్షలు జమ చేసినట్లు వెల్లడించారు.
వ్యవసాయ ఏడీ సుబ్రమణ్యం మాట్లాడుతూ, యూరియా, డీఏపీ ఎరువుల కోసం రైతులు యాప్ ద్వారా నమోదు చేసుకుంటే సరఫరా చేస్తామని తెలిపారు. భవిష్యత్తులో కరువు పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉన్నందున రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టాలని సూచించారు.
అనంతరం రైతులకు మెగా చెక్కులు పంపిణీ చేశారు.
అన్నదాత సుఖీభవతో రైతులకు పెట్టుబడి భారం తగ్గింపు -జడ్పీటీసీ కూరపాటి విజయలక్ష్మి
RELATED ARTICLES
