ePaper
Sunday, August 9, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్ఇక నిరంతర కార్యక్రమంగా జలధార- జలహారతి

ఇక నిరంతర కార్యక్రమంగా జలధార- జలహారతి

📰 Generate e-Paper Clip

* ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.
కుప్పం,ఆగస్టు 08 (గరుడ ధాత్రి న్యూస్):జలధార- జలహారతి కార్యక్రమాన్ని నిరంతర కార్యక్రమంగా చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఎల్సినో ప్రభావం అంచనాలకు మించి ఉన్నందున నీటి వనరుల పరిరక్షణ, తాగు నీటి సరఫరా, పంటల రక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. జలధార- జలహరతి కార్యక్రమంపై శనివారం క్యాంప్ కార్యాలయం నుంచి సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జలధార- జలహారతి కింద మొత్తంగా 82,865 పనులను గుర్తించగా..79,826 పనులు పూర్తి చేసినట్టు అధికారులు సీఎంకు వివరించారు. మొత్తం రూ.3,409.35 కోట్ల పనులు మంజూరు చేసినట్లు తెలిపారు. చెరువులు, ఫీడర్ ఛానళ్లు, ఫార్మ్ పాండ్లు, ట్రెంచ్ల తవ్వకం వంటి పనులను చేపట్టినట్టు స్పష్టం చేశారు.ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వస్తున్నప్పటికీ రాష్ట్రంలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడం లేదని ప్రాజెక్టుల్లోకి వస్తున్న నీటిని సమర్థంగా వినియోగించుకుని రిజర్వాయర్లను వీలైనంత మేర నింపాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఇప్పటికే అందుబాటులో ఉన్న నీటి వనరులను జాగ్రత్తగా వినియోగించుకోవడంతో పాటు భూగర్భ జలాలను సద్వినియోగం చేసుకోవాలని దిశానిర్దేశం చేశారు. తాగు నీటి వసతి పూర్తిస్థాయిలో అందుబాటులో లేని ప్రాంతాలను గుర్తించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. అవసరమైన ప్రాంతాలకు నీటిని సరఫరా చేసేందుకు ట్యాంకర్లను ముందుగానే సిద్ధం చేసుకోవాలని చెప్పారు. వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికీ ఇప్పటికే సాగులో ఉన్న పంటలను కాపాడేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సీఎం సూచించారు.వర్షాభావ పరిస్థితుల కారణంగా పశుగ్రాసం కొరత ఏర్పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. పశువులకు అవసరమైన మేత, నీటి లభ్యతను నిర్ధారించడంతో పాటు అవసరమైన చోట్ల గోకులాలను సిద్ధం చేయాలని సూచించారు. పశు సంపదకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా జిల్లా స్థాయిలో ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని చెప్పారు. ముందస్తు ప్రణాళికతో పనిచేస్తే భవిష్యత్లో ఇబ్బందులను సమర్థంగా ఎదుర్కోవచ్చని పేర్కొన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని సీఎం ఆదేశించారు. నీటి వనరుల సంరక్షణ అనేది నిత్యం జరగాలని చెప్పారు. వివిధ కారణాల వల్ల చాలా కాలంగా నీటి లభ్యత లేని చెరువులు, కాల్వలను గుర్తించి నీటి సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!