*కుక్కకాటుకు పలువురికి గాయాలు
సంబంధిత అధికారుల తక్షణ చర్యలకు స్థానికుల విజ్ఞప్తి
✒️నాగలాపురం పట్టణంలోని ఈస్ట్ హరిజనవాడలో పిచ్చికుక్క హల్‌చల్ చేస్తూ స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. వీధుల్లో తిరుగుతూ పలువురిని కరిచినట్లు స్థానికులు తెలిపారు. దీంతో కుక్కకాటుకు గురైన వారు నాగలాపురం ప్రభుత్వ ఆసుపత్రిని ఆశ్రయించి ప్రథమ చికిత్స పొందుతున్నట్లు సమాచారం.
పిచ్చికుక్క సంచారంతో చిన్నారులు, వృద్ధులు, మహిళలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటే భయపడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో వీధుల్లో తిరిగే ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.
కుక్కకాటు ఘటనలు మరింత పెరగకముందే సంబంధిత అధికారులు స్పందించి పిచ్చికుక్కను పట్టుకుని, ప్రజలకు రక్షణ కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. అలాగే పట్టణంలోని వీధికుక్కల నియంత్రణకు శాశ్వత చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
కుక్కకాటుకు గురైన వారు వైద్యుల సూచన మేరకు రేబిస్ నిరోధక చికిత్స పొందడం అత్యవసరం. కుక్కకాటు అనంతరం వైద్య సహాయం, రేబిస్ టీకా తదితర వివరాల కోసం జాతీయ రేబిస్ నియంత్రణ కార్యక్రమం హెల్ప్‌లైన్ 15400ను సంప్రదించవచ్చు.
