ప్రజా ప్రభుత్వం రెండేళ్లలోనే సుపరిపాలన, సంక్షేమం, అభివృద్ధికి కొత్త నిర్వచనం… మంత్రి నారా లోకేష్
కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి సాక్షిగా ప్రజా ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకుందని రాష్ట్ర మంత్రి శ్రీ నారా లోకేష్ తెలిపారు. శుక్రవారం స్థానిక దామినేడు వద్ద నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మాధవ్, కూటమి ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్యకర్తలు మరియు ప్రజలకు హృదయపూర్వక అభివాదాలు తెలియజేశారు.
ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రశాంతత నెలకొందని, గతంలో ఉన్నట్లుగా దాడులు, హత్యలు, రాజకీయ వేధింపులు, అసభ్య రాజకీయ సంస్కృతి ప్రస్తుతం కనిపించడం లేదన్నారు. యువగళం పాదయాత్ర సందర్భంగా చంద్రగిరి గడ్డపై తాను చేసిన హెచ్చరికను గుర్తుచేస్తూ, తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని అప్పటి ప్రభుత్వాన్ని హెచ్చరించానని, దేవుడితో పెట్టుకున్నవారి పరిస్థితి ఏమైందో ప్రజలు ఆలోచించాలని అన్నారు.
స్వర్గీయ నందమూరి తారకరామారావు రాయలసీమ అభివృద్ధికి ఎనలేని సేవలు చేశారని, తెలుగు గంగ, గాలేరు-నగరి వంటి ప్రాజెక్టులకు రూపకల్పన చేయడంతో పాటు మహిళల కోసం ప్రత్యేక విశ్వవిద్యాలయం, నిత్య అన్నదానం వంటి కార్యక్రమాలు ప్రారంభించారని కొనియాడారు.
ప్రస్తుత రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారిని విరాట్ కోహ్లీతో పోల్చిన లోకేష్, బౌలర్లు మారినా బ్యాట్స్‌మన్ ఒకరే అన్నట్లుగా అభివృద్ధి రాజకీయాల్లో చంద్రబాబు గారికి ప్రత్యామ్నాయం లేదన్నారు. బిందు సేద్యం, హంద్రీ-నీవా, సుజల స్రవంతి వంటి కార్యక్రమాల ద్వారా రాయలసీమను అభివృద్ధి పథంలో నడిపించారని, ఇప్పుడు లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులతో “మిషన్ రాయలసీమ” ప్రారంభించబోతున్నారని తెలిపారు.
2019-2024 మధ్య రాష్ట్రంలో జరిగిన ఘటనలను ప్రస్తావిస్తూ, అమర్‌నాథ్ గౌడ్, డాక్టర్ సుధాకర్, సుబ్రహ్మణ్యం, మిస్బా కుటుంబం వంటి సంఘటనలను ఉదాహరణగా పేర్కొంటూ, గత ప్రభుత్వ పాలనలో జరిగిన అన్యాయాలను ప్రజలు మరవలేదన్నారు. “వై నాట్ 175” అన్నవారికి ప్రజలు 11 స్థానాలకే పరిమితం చేస్తూ తీర్పు ఇచ్చారని వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం కొందరు “రప రప” అంటూ హెచ్చరికలు చేస్తున్నారని, చట్టవ్యతిరేక చర్యలను ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని స్పష్టం చేశారు. ప్రజా ప్రభుత్వం ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తోందని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సంక్షేమ కార్యక్రమాల్లో వెనుకడుగు వేయలేదన్నారు.
వృద్ధులకు రూ.4,000 పెన్షన్, వికలాంగులకు రూ.6,000, మంచానికే పరిమితమైన వారికి రూ.15,000 పెన్షన్ అందిస్తున్నామని చెప్పారు. మూసివేసిన అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభించామని, డీఎస్సీ ద్వారా 16,000 పైగా ఉపాధ్యాయ పోస్టులు, 6,000 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేశామని, త్వరలో మరో 10,000 ఉద్యోగాలను భర్తీ చేస్తామని తెలిపారు.
చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్, ఆటో డ్రైవర్లు, మత్స్యకారుల సంక్షేమ కార్యక్రమాలు, మహిళలకు “స్త్రీ శక్తి” పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం, “దీపం” పథకం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నామని వివరించారు.
“ఒకే రాష్ట్రం – ఒకే రాజధాని, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ” ప్రజా ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. గూగుల్, ఆర్సెలార్ మిట్టల్ వంటి భారీ పెట్టుబడులను ఉత్తరాంధ్రకు, క్వాంటం వ్యాలీని కోస్తాంధ్రకు, రాయల్ ఎన్‌ఫీల్డ్, ఫైటర్ జెట్ తయారీ పరిశ్రమలను రాయలసీమకు తీసుకువచ్చిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు.
గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, అభివృద్ధి ప్రాజెక్టుల విషయంలో అడ్డంకులు సృష్టించిన వారే ఇప్పుడు వాటికి క్రెడిట్ తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. గూగుల్, ఆర్సెలార్ మిట్టల్ వంటి సంస్థల పెట్టుబడులను అడ్డుకునేందుకు కోర్టుల్లో కేసులు వేసి, ఇప్పుడు వాటిని తమ విజయాలుగా చెప్పుకోవడం విచిత్రమన్నారు.
డీఎస్సీ నియామకాలపై గతంలో వందలాది కేసులు వేసినా, కేవలం 150 రోజుల్లో 16,347 పోస్టులను భర్తీ చేసిన ఘనత ప్రజా ప్రభుత్వానిదేనన్నారు. ఉపాధ్యాయుల పట్ల గత ప్రభుత్వ వైఖరిని విమర్శిస్తూ, ఉపాధ్యాయులను మద్యం దుకాణాల వద్ద విధుల్లో నిలబెట్టారని గుర్తుచేశారు.
రాష్ట్రానికి సాగర్ డిఫెన్స్ వంటి రక్షణ రంగ పరిశ్రమలను తీసుకురావడంలో ఎన్డీఏ ప్రభుత్వం కీలక పాత్ర పోషించిందన్నారు. కావలి ప్రాంతంలో వేలాది మందికి ఉపాధి కల్పించే ఈ పరిశ్రమను కూడా అడ్డుకునేందుకు ప్రయత్నించారని ఆరోపించారు.
విశాఖ ఉక్కు పరిరక్షణలో ఎన్డీఏ ప్రభుత్వాల పాత్రను గుర్తుచేస్తూ, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి, ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసి విశాఖ ఉక్కును కాపాడారని తెలిపారు. ఇటీవల జరిగిన ప్రమాదంలో మరణించిన కార్మిక కుటుంబాలకు శాశ్వత అండగా నిలుస్తామని హామీ ఇచ్చామన్నారు. శాశ్వత ఉద్యోగుల కుటుంబాలకు రూ.2 కోట్లు, కాంట్రాక్ట్ ఉద్యోగుల కుటుంబాలకు రూ.1 కోటి చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నామని చెప్పారు.
ప్రపంచవ్యాప్తంగా భారతదేశం ప్రతిష్ట పెరగడానికి ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వమే కారణమని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల్లో “డబుల్ ఇంజన్ ప్రభుత్వం” ఉంటే, ఆంధ్రప్రదేశ్‌లో “డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ ప్రభుత్వం” ఉందన్నారు. అమరావతి, పోలవరం నిధులు, విశాఖ రైల్వే జోన్, ఏఎంసీఏ ఫైటర్ జెట్ ప్రాజెక్ట్ వంటి అంశాలు ఈ సమన్వయానికి నిదర్శనమని చెప్పారు.
రాయలసీమకు రాయల్ ఎన్‌ఫీల్డ్, ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్, క్యారియర్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి సంస్థలు రావడం ఎన్డీఏ ప్రభుత్వ కట్టుబాటుకు నిదర్శనమన్నారు. లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులతో “మిషన్ రాయలసీమ” అమలు చేయనున్నట్లు ప్రకటించారు.
తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలు ఒక కుటుంబంలా పనిచేయాలని, చిన్న చిన్న సమస్యలను పరస్పర చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. అహంకారం వల్ల ఏమి జరుగుతుందో ప్రజలు ఇప్పటికే చూశారని, 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పడిపోయిన ఉదాహరణ అందరికీ తెలుసన్నారు.
గుజరాత్, ఒడిశా రాష్ట్రాల మాదిరిగా ప్రభుత్వ కొనసాగింపు వల్లే అభివృద్ధి సాధ్యమవుతుందని, పెట్టుబడులు, మౌలిక వసతులు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజా ప్రభుత్వం కొనసాగింపు అవసరమని ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు సూచించారు.
చివరిగా, “ఎన్డీఏతో వికాసం – గొడ్డలి పార్టీతో విద్వంసం” అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిస్తూ, తనకు ఈ అవకాశం కల్పించిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.
