రూ.50 వేల నగదు, 16 గ్రాముల బంగారం, వెండి వస్తువులు అపహరణ
కార్వేటినగరం, సెప్టెంబర్ 13 గరుడ దాత్రి న్యూస్:
కార్వేటినగరం మేజర్ పంచాయతీ పరిధిలోని దివిటి వీధిలో ఓ ఇంట్లో చోరీ జరిగిన ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది.
స్థానికుల కథనం ప్రకారం.. దివిటి వీధిలో నివాసం ఉంటున్న కుప్పమ్మ కుటుంబ సభ్యులతో కలిసి శనివారం రాత్రి ఓ వివాహ కార్యక్రమానికి వెళ్లారు. ఆదివారం ఉదయం ఇంటికి తిరిగి వచ్చి చూడగా ఇంటి తలుపులు తెరిచి ఉండటంతో పాటు, ఇంట్లోని వస్తువులు చిందరవందరగా కనిపించాయి.
గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి 16 గ్రాముల బంగారు నగలు, రూ.50 వేల నగదు, వెండి దీపాలు తదితర వస్తువులను అపహరించినట్లు బాధితులు గుర్తించారు. ఈ మేరకు కుప్పమ్మ కుమారుడు లక్ష్మీనారాయణ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఆదివారం మధ్యాహ్నం సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం క్లూస్ టీమ్‌ను రప్పించి ఆధారాలను సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. చోరీకి పాల్పడిన వ్యక్తుల వివరాలను సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు.
