కేరళ ‘రోషన్ గ్యాంగ్’ సహా 11 మంది అంతరాష్ట్ర నేరగాళ్ల అరెస్ట్!
పలమనేరు, జూన్ 24 ( గరుడ ధాత్రి ) :
సినిమా ఫక్కీలో పలమనేరు సమీపంలో జరిగిన ఓ వ్యాపారి అంతరాష్ట్ర కిడ్నాప్ ఉదంతాన్ని చిత్తూరు జిల్లా పలమనేరు పోలీసులు అత్యంత చాకచక్యంగా ఛేదించారు. రెండు కోట్ల రూపాయల డిమాండ్‌తో రంగంలోకి దిగి, కోటి రూపాయల నగదు, కేజీకి పైగా బంగారం దోచుకెళ్లిన కేరళకు చెందిన ప్రమాదకర ‘రోషన్ గ్యాంగ్’ సభ్యులతో పాటు స్థానిక నిందితులను పలమనేరు అర్బన్ పోలీసులు అరెస్ట్ చేశారు. చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడీ ఆదేశాల మేరకు, పలమనేరు ఎస్డీపిఓ డేగల ప్రభాకర్ ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని బృందం ఈ అంతరాష్ట్ర ముఠాను పట్టుకుంది. గంగవరం మండలానికి చెందిన ఎం.సి. రవి (47) అనే వ్యక్తిని ఈ నెల 7వ తేదీన పలమనేరు-గుడియాత్తం రహదారిలోని వడ్డూరు క్రాస్ వద్ద ఒక ముఠా అపహరించింది. బాధితుడిని నేరుగా కడప జిల్లా పులివెందులకు తరలించి, అక్కడ బంధించి చంపేస్తామని బెదిరించారు. కుటుంబ సభ్యుల నుంచి రూ. 2 కోట్లు డిమాండ్ చేశారు. బాధితుడి బంధువులు భయపడి జూన్ 8న ఉదయం చిక్కబళ్లాపురం హైవేపై నిందితులకు రూ. కోటి నగదు అందజేశారు. అయినప్పటికీ సంతృప్తి చెందని ముఠా.. రవి వద్ద ఉన్న సుమారు 900 గ్రాముల బంగారు ఆభరణాలను కూడా బలవంతంగా లాక్కొని, అతడిని అక్కడే వదిలేసి పరారయ్యారు. జూన్ 12న పలమనేరు అర్బన్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెం: 120/2026 కింద కేసు నమోదైంది.
పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. పలమనేరు సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో పెండింగ్‌లో ఉన్న ఐపీ నెం.10/2021 కేసుకు సంబంధించిన ఆర్థిక వివాదమే ఈ కిడ్నాప్‌కు మూలకారణం. వ్యక్తిగత ఆర్థిక లాభాల కోసం సుంకరి మహేష్ నాయుడు, భానుప్రకాశ్ అనే వ్యక్తులు కడప జిల్లాకు చెందిన ఉప్పలూరు నాగేశ్వర రెడ్డిని సంప్రదించారు. నాగేశ్వర రెడ్డి కేరళకు చెందిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ రోషన్ వర్గీస్ గ్యాంగ్‌ను రంగంలోకి దించాడు. భానుప్రకాశ్ బాధితుడి కదలికలను నిఘా వేసి సమాచారం అందించగా.. కేరళ, తెలుగు రాష్ట్రాల ముఠా అంతా కలిసి గంగవరంలోని ఒక లాడ్జిలో బస చేసి ఈ ఘాతుకానికి స్కెచ్ వేశారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజీలు, మొబైల్ కాల్ డేటా, శాస్త్రీయ ఆధారాల సాయంతో గంగవరం మండలం గండ్రాజుపల్లి చెక్ పోస్ట్ వద్ద నిందితులను వెంబడించి పట్టుకున్నారు. కేరళకు చెందిన అప్పు అరుణ్, ఎడ్విన్ థామస్, దీపు మోన్, నితిన్ జానీ, అభయ్ , రతీష్ , లిబిన్ లతో పాటు ఏపీ, తెలంగాణకు చెందిన ఉప్పలూరు నాగేశ్వర రెడ్డి, సుంకరి మహేష్ నాయుడు, పందేల్లపల్లి రామిరెడ్డి, గుండ్రా మహేశ్వర్ రెడ్డిలను అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితులు రోషన్ వర్గీస్, భానుప్రకాశ్, ప్రణీత్ రెడ్డి సహా మరికొందరు పరారీలో ఉన్నారు.
నిందితుల నుంచి రూ. 22 లక్షల నగదు, కిడ్నాప్‌కు వాడిన 3 కార్లు (మారుతి స్విఫ్ట్ డిజైర్ – TS22 T 6827, i20 – KL63 K 4961, క్రెటా – KL52W1109), 12 మొబైల్ ఫోన్లు, మరియు మోసాలకు ఉపయోగించే నకిలీ పోలీస్ ఐడీ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారులైన నిందితులకు భారీ నేర చరిత్ర ఉంది. కేరళ గ్యాంగ్ లీడర్ రోషన్‌పై అక్కడ వివిధ స్టేషన్లలో హత్యాయత్నం, బాంబు పేలుడు పదార్థాల చట్టం, డ్రగ్స్ (ఎన్ డి పి ఎస్) కేసులతో కలిపి ఏకంగా 21 క్రిమినల్ కేసులు ఉన్నాయి. అలాగే ఏపీకి చెందిన నాగేశ్వర రెడ్డిపై హత్యాయత్నం, అక్రమ మద్యం రవాణా, సైబర్ నేరాలకు సంబంధించి 15 కేసులు నమోదై ఉన్నాయి. అత్యంత క్లిష్టమైన ఈ కేసును శాస్త్రీయ ఆధారాలతో, చాకచక్యంగా ఛేదించిన పలమనేరు రూరల్ సీఐ బి. పరశురాముడు, బంగారుపాళ్యం ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు, పలమనేరు అర్బన్ ఎస్ఐ లోకేష్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ చంద్రశేఖర్, కానిస్టేబుళ్లు గణేష్, నరేష్, భాస్కర్ మరియు టెక్నికల్ టీమ్ సభ్యుడు శశికుమార్‌లను జిల్లా ఎస్పీ తుషార్ డూడీ, ఎస్డీపిఓ ప్రభాకర్ ప్రత్యేకంగా అభినందించారు. అరెస్ట్ చేసిన నిందితులను పలమనేరు కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
