ePaper
Friday, June 19, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్ధ్వజారోహణ మహోత్సవంతో వైభవంగా ఆరంభమైన శ్రీ వేదనారాయణస్వామివారి బ్రహ్మోత్సవాలు

ధ్వజారోహణ మహోత్సవంతో వైభవంగా ఆరంభమైన శ్రీ వేదనారాయణస్వామివారి బ్రహ్మోత్సవాలు

📰 Generate e-Paper Clip

తిరుపతి, 2026 మే 01

ధ్వజారోహణ మహోత్సవంతో వైభవంగా ఆరంభమైన శ్రీ వేదనారాయణస్వామివారి బ్రహ్మోత్సవాలు

నాగలాపురంలోని శ్రీ వేదవల్లీ సమేత శ్రీ వేదనారాయణ స్వామివారి ఆలయంలో శుక్రవారం ఉదయం ధ్వజారోహణ మహోత్సవంతో వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తి పారవశ్యంతో ఘనంగా ప్రారంభమయ్యాయి.

వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నినాదాలు, భక్తుల గోవింద నామస్మరణల మధ్య ఈ పవిత్ర కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించారు.

ఉదయం 4.30 నుండి 5.30 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు తిరుచ్చి ఉత్సవం నిర్వహించారు. ఈ ఉత్సవం ద్వారా బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను స్వామివారు ఒకమారు పర్యవేక్షిస్తారని ఆధ్యాత్మిక విశ్వాసం.

అనంతరం ఉదయం 5.30 నుండి 6.30 గంటల మధ్య మేషలగ్నంలో ధ్వజారోహణ ఘట్టం వైఖానస ఆగమ విధానంలో ఘనంగా నిర్వహించారు. గరుత్మంతుణ్ణి కొత్త వస్త్రంపై ఆవిష్కరించి, పూజలు చేసి ధ్వజస్తంభంపై ప్రతిష్ఠించారు. దీని ద్వారా 18 గణాలు, ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించినట్లు భావిస్తారు.

తదుపరి ఉదయం 11 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు స్నపన తిరుమంజనం వైభవంగా జరిగింది. పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం నిర్వహించి భక్తులను ఆధ్యాత్మికానందంలో ముంచెత్తారు.

సాయంత్రం 5.30 నుండి 6.30 గంటల వరకు ఊంజల్ సేవ, రాత్రి 7.30 నుండి 9 గంటల వరకు పెద్దశేష వాహనసేవ జరుగనున్నాయి.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు శ్రీ శ్రీనివాసులు, శ్రీ చంగల్ రాయులు, అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!