ePaper
Thursday, August 13, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్నైజీరియాలో కత్తిసాములో కదం తొక్కిన లోకేష్‌!

నైజీరియాలో కత్తిసాములో కదం తొక్కిన లోకేష్‌!

📰 Generate e-Paper Clip

యూ3 కామన్వెల్త్ ఛాంపియన్‌షిప్‌లో సిల్వర్‌ మెడల్‌.. తెలంగాణ రాష్ట్రం తరఫున బరిలోకి దిగి ద్వితీయ స్థానంలో నిలిచిన వేమాని లోకేష్‌.. పుల్లమనాయుడు గ్రామంలో వెల్లువెత్తిన హర్షం

రామచంద్రపురం: కత్తిసాము క్రీడలో రామచంద్రపురం మండలానికి చెందిన యువ ప్రతిభ అంతర్జాతీయ స్థాయిలో మెరిసింది. మండలంలోని పుల్లమనాయుడు గ్రామానికి చెందిన వేమాని చిరంజీవి, చంద్ర దంపతుల కుమారుడు వేమాని లోకేష్‌ నైజీరియా వేదికగా జరిగిన యూ3 కామన్వెల్త్ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో సత్తా చాటి సిల్వర్‌ మెడల్‌ సాధించాడు. తెలంగాణ రాష్ట్రం తరఫున ఈ అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్న లోకేష్‌ అద్భుత ప్రతిభ కనబరిచి ద్వితీయ స్థానంలో నిలిచి పతకాన్ని కైవసం చేసుకున్నాడు.

కత్తిసాము పోటీల్లో లోకేష్‌ మెరుపువేగంతో కదులుతూ, అత్యంత చాకచక్యంగా కత్తి విన్యాసాలు ప్రదర్శించి ప్రత్యర్థులకు దీటుగా పోరాడాడు. ప్రతి దశలోనూ ఆత్మవిశ్వాసంతో పోటీని ఎదుర్కొంటూ తన ప్రతిభను చాటుకున్నాడు. అంతర్జాతీయ స్థాయి పోటీల్లో రాణించి పతకం సాధించడం ద్వారా తన సత్తాను నిరూపించుకున్నాడు.

గ్రామంలో వెల్లువెత్తిన అభినందనలు

లోకేష్‌ అంతర్జాతీయ స్థాయిలో సిల్వర్‌ మెడల్‌ సాధించిన విషయం తెలియడంతో పుల్లమనాయుడు గ్రామంలో ఆనందోత్సాహాలు వెల్లువెత్తాయి. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు, క్రీడాభిమానులు లోకేష్‌ను అభినందించారు. చిన్న గ్రామం నుంచి అంతర్జాతీయ స్థాయి క్రీడా వేదికపైకి వెళ్లి పతకం సాధించడం పట్ల స్థానికులు గర్వం వ్యక్తం చేశారు.

మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్ష

కత్తిసాము క్రీడలో లోకేష్‌ సాధించిన ఈ విజయం యువతకు స్ఫూర్తిదాయకమని గ్రామస్తులు పేర్కొన్నారు. క్రీడల్లో ఆసక్తి ఉన్న యువతకు సరైన ప్రోత్సాహం, శిక్షణ అందిస్తే అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించే అవకాశం ఉందన్నారు. లోకేష్‌ భవిష్యత్తులో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని పతకాలు సాధించి రామచంద్రపురం మండలానికి, పుల్లమనాయుడు గ్రామానికి మరింత పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!