ePaper
Thursday, October 8, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిపన్నుల వసూళ్లలో గందరగోళం

పన్నుల వసూళ్లలో గందరగోళం

📰 Generate e-Paper Clip

చెల్లించినా.. మళ్లీ కట్టాల్సిందేనా..?

నాగలాపురం అక్టోబర్ 7 గరుడధాత్రి :

తిరుపతి జిల్లా నాగలాపురం మండలంలోని నాగలాపురం మేజర్‌ పంచాయతీలో వార్షిక ఇంటి పన్ను, తాగునీటి పన్నుల వసూళ్ల వ్యవహారం తాజాగా వివాదాస్పదంగా మారింది. గతంలో పన్నులు చెల్లించినట్లు రశీదులు చూపుతున్నా.. పంచాయతీ రికార్డుల్లో వివరాలు లేవంటూ ప్రస్తుత సిబ్బంది మళ్లీ పన్నులు చెల్లించాలని కోరుతున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.
గ్రామస్థులు తెలిపిన వివరాల మేరకు.. గతేడాది పన్నుల వసూళ్ల సమయంలో రెండు బిల్లు పుస్తకాలు ముద్రించి వసూళ్లు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ సమయంలో పన్నులు వసూలు చేసిన అధికారులు బదిలీ కావడంతో ప్రస్తుతం కొత్త సిబ్బంది వసూళ్లకు వెళ్తున్నారు. గతంలో పన్నులు చెల్లించిన గ్రామస్థులు తమ వద్ద ఉన్న రశీదులను చూపిస్తుండగా, పంచాయతీ రికార్డుల్లో చెల్లింపుల వివరాలు కనిపించడం లేదని అధికారులు చెబుతున్నట్లు వారు వాపోతున్నారు.
తమ వద్ద ఉన్న రశీదులు చెల్లవని, పన్నులు మరోసారి చెల్లించాల్సిందేనని అధికారులు చెబుతున్నారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో తాము ఒకసారి చెల్లించిన పన్నులను మళ్లీ ఎలా చెల్లించాలని వారు ప్రశ్నిస్తున్నారు.
పన్నుల వసూళ్లలో జరిగినట్లు చెబుతున్న అవకతవకలపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు. గతంలో జారీ చేసిన బిల్లు పుస్తకాలు, రశీదులు, పంచాయతీ రికార్డులను పరిశీలించి వాస్తవాలను నిగ్గుతేల్చాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు తేలితే సంబంధిత అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకుని, తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!