* స్వచ్ఛంద అవార్డు 2026 కార్యక్రమం.
చిత్తూరు బ్యూరో, అక్టోబర్ 02(గరుడ ధాత్రి న్యూస్):మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రిల జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన ‘స్వచ్ఛాంధ్ర అవార్డ్స్ 2026’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గాంధీజీ స్వచ్ఛతకే ప్రథమ ప్రాధాన్యం ఇచ్చారని, పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తుచేశారు. జపాన్ వంటి దేశాల్లోని పౌర బాధ్యతను ఉదాహరణగా పేర్కొంటూ, రాష్ట్రంలో గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పేరుకుపోయిన చెత్తను తొలగించి పరిశుభ్రమైన ఆంధ్ర ప్రదేశ్ ను నిర్మించేందుకు ప్రతి మూడో శనివారం ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమాన్ని ఉద్యమస్ఫూర్తితో నిర్వహిస్తున్నామని తెలిపారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా రాష్ట్రాన్ని స్వచ్ఛంగా తీర్చిదిద్దుతున్నామని వెల్లడించిన సీఎం సమక్షంలో, నెట్ జీరో సాధన లక్ష్యంగా ఐఐటీ కాన్పూర్ – స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ మధ్య కీలక అవగాహన ఒప్పందం జరిగిందన్నారు.స్వచ్ఛత అనేది కేవలం రోడ్లకే పరిమితం కాదని, ప్రతి ఒక్కరి ఆలోచనలు, ఆరోగ్యం కూడా శుభ్రంగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. పరిశుభ్రత కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, పాఠశాలలు, ఆసుపత్రులు, పార్కులు శుభ్రంగా ఉండాలంటే ఐదు కోట్ల ప్రజలు సామాజిక బాధ్యతతో భాగస్వాములు కావాలని కోరారు. చెత్తను సమస్యగా చూడకుండా విద్యుత్, ఎరువులు, బయోగ్యాస్ తయారు చేస్తూ సర్క్యులర్ ఎకానమీ దిశగా రాష్ట్రాన్ని తీసుకెళ్తున్నామని తెలిపారు. జీరో గార్బేజ్ లక్ష్యంతో స్వచ్ఛ రథాలు, ఇ-ఆటోలు, ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కేంద్రాలు, గోబర్ధన్ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం వెల్లడించారు.విజయవాడలోని ఏ-కన్వెన్షన్లో నిర్వహించిన ‘స్వచ్ఛాంధ్ర అవార్డ్స్ 2026’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్వచ్ఛత ప్రదర్శనను సీఎం తిలకించి, పారిశుధ్య నిర్వహణలో విశేష ప్రతిభ కనబరిచిన స్వచ్ఛ గ్రామాలు, పట్టణాలు, సంస్థలు మరియు ప్రాంగణాలకు ప్రతిష్టాత్మక స్వచ్ఛతా అవార్డులను ప్రదానం చేశారు. పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్ను నిర్మించడంలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం కీలకమని ఈ సందర్భంగా నాయకులు స్పష్టం చేశారు. ఈ వైభవంగా జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ సహా పలువురు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
