బైరెడ్డిపల్లి, నవంబరు 1: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల విధులకు నియమితులైన ఉద్యోగుల కోసం బైరెడ్డిపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ కేంద్రాన్ని రిటర్నింగ్ అధికారి ఎన్.వెంకట్రాముడు, సహాయ రిటర్నింగ్ అధికారి, ఎంపీడీఓ ఆనందబాబు ఆదివారం పరిశీలించారు. ఓటర్ల వివరాల పరిశీలన, బ్యాలెట్ పత్రాల జారీ, ఓటు గోప్యత, సీల్డ్ కవర్ల స్వీకరణ ఏర్పాట్లను సమీక్షించారు.
నవంబరు 2వ తేదీన కూడా పోస్టల్ బ్యాలెట్ సదుపాయం అందుబాటులో ఉంటుందని ఆర్‌ఓ తెలిపారు. ఎన్నికల విధులకు నియమితులై, పోస్టల్ బ్యాలెట్‌కు అనుమతి పొందిన అర్హులైన ఉద్యోగులు తమ విధుల ఉత్తర్వులు, గుర్తింపు పత్రంతో కేంద్రానికి హాజరుకావాలని సూచించారు.
అర్హులైన ఉద్యోగులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలనివారు కోరారు. డిక్లరేషన్‌పై సంతకం, సంబంధిత అధికారి ధ్రువీకరణ పూర్తి చేసి, నిర్దేశిత కవర్లలో ఓటును భద్రపరిచి కేంద్రంలోని పెట్టెలో వేయాలని సూచించారు.
